ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు... ఏపీ కేబినేట్ నిర్ణయాలివే!
ఈ రోజు ఏపీ క్యాబినెట్ సమావేశం మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సమావేశం ముగిసింది.
By: Tupaki Desk | 16 July 2024 9:58 AM GMTఈ రోజు ఏపీ క్యాబినెట్ సమావేశం మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సమావేశం ముగిసింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం సుమారు రెండున్నర గంటలపాటు సాగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎంతో కలిసి మంత్రులు చర్చించారు. ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అవును... ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ.. చివర్లో అత్యంత ప్రభావం చూపించి, జగన్ కు శాపంగా మారింది మాత్రం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలామంది అభిప్రాయం! ఆ సమయంలో... తాను అధికారంలోకి వస్తే ఈ యాక్ట్ ను రద్దు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు.
దీంతో... తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా... ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఏపీ కేబినేట్ తాజాగా ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో... దీనితోపాటు నూతన ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో... కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలను ప్రభుత్వం రూపొందించనుంది.
ఇదే క్రమంలో... రెండు వేల కోట్ల రుణం పౌర సరఫరాల శాఖ తీసుకునేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు నిమిత్తం నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్.సీ.డీ.సీ) నుంచి రూ.3,200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్ కు ప్రభుత్వ గ్యారెంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.
ఇదే సమయంలో... పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపుకు విధివిధానాల ఖరారుకు కమిటీ వేయాలని ఏపీ కేబినెట్ తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు... వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ లతో ఓ కమిటీని మంత్రివర్గం నియమించింది.
ఇక... ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కేబినెట్ నిర్ణయించింది. అధికారంలోకి వచ్చి నెల రోజులు పూర్తయిన సందర్భంగా అన్ని శాఖల పనితీరుపైనా సమీక్షించారు. ప్రజల నుంచి వస్తోన్న అభిప్రాయాలపైనా కేబినెట్ చర్చించింది.