Begin typing your search above and press return to search.

గుడ్ న్యూస్... మరో ఎన్నికల హామీకి కేబినెట్ ఆమోదం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతతన ఏపీ కేబినెట్ సమావేశం సచివాలయంలో జరిగింది.

By:  Tupaki Desk   |   7 Aug 2024 11:01 AM GMT
గుడ్  న్యూస్... మరో  ఎన్నికల హామీకి కేబినెట్  ఆమోదం!
X

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతతన ఏపీ కేబినెట్ సమావేశం సచివాలయంలో జరిగింది. ఈ సందర్భంగా నేటి కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానంగా లిక్కర్ పాలసీపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... కొత్త పాలసీ ప్రకటనకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే సమయంలో భూముల సరే, మావోయిస్టులు మొదలైన విషయాలపై కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకొంది.

అవును... ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా భూముల సరే రాళ్లపై జగన్ ఫోటోల అంశంపైనా చర్చించడంతోపాటు కొత్త లిక్కర్ పాలసీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే క్రమంలో... మావోయిస్టులపై నిషేధాన్ని పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయించింది. ఈ క్రమంలో గత ప్రభుత్వ పాలనలో దోపిడీ కోసమే అన్నట్లుగా నాటి ఎక్సైజ్ పాలసీని రూపొందించినట్లు కేబినెట్ అభిప్రాయపడింది.

ఈ నేపథ్యంలోనే నాటి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ పాలసీని తప్పించి, కొత్త ఎక్సైజ్ పాలసీ రుపొందించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదే సమయంలో ఎక్సైజ్ ప్రొక్యూర్మెంట్ పాలసీలోనూ మార్పులు తేవాలని కేబినెట్ సూచించింది. ఇదే క్రమంలో.. మావోయిస్టులపై నిషేధం పొడిగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో సర్వే రాళ్లపై జగన్ బొమ్మ విషయంపైనా మంత్రివర్గంలో చర్చ జరిగింది.

దీంతో... సర్వేరాళ్లపై జగన్ బొమ్మ, పేరు తొలగించేందుకు తాజాగా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా స్పందించిన పలువురు మంత్రులు... బొమ్మల పిచ్చితో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.700 కోట్లు తగలేశారని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా జగన్ బొమ్మను సర్వే రాళ్లపై తొలగించడానికి కేబినేట్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇదే సమయంలో రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీకీ కేబినేట్ ఆమోదం తెలిపింది.

ఇదే సమయంలో... మత్స్యకారులకు ఊరట నిచ్చేలా ఏపీ కేబినెట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మత్స్యకారులకు ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పే 217 జీవోను రద్దు చేయాలని నిర్ణయించింది.

ఏమిటీ 217 జీవో?:

గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదమైన 217 జీవో ద్వారా చెరువు చెరువుల్లో చేపలు పట్టడానికి టెండర్లు పిలిచేవారు. దీంతో... టెండర్లు దక్కించుకున్నవారికి మాత్రమే చేపలు పట్టుకునే హక్కు లభించేది! దీంతో.. ఈ జీవోపై గతంలో విపక్షాలుగా ఉన్న జనసేన, టీడీపీ పోరాటాలు చేశాయి. ఈ జీవో మత్స్యకారుల ఉనికికి, ఉపాధికి విఘాతం కలిగిస్తుందని ఆందోళన చేశారు.

అయితే... 100 ఎకరాలకంటే ఎక్కువ ఉన్న చెరువులకే ఈ జీవో వర్తిస్తుందని అప్పటి వైసీపీ సర్కార్ స్పష్టం చేసినా.. 100 ఎకరాలకంటే తక్కువ విస్తీర్ణంలో ఉన్న చెరువులకు ఈ జీవో వర్తించదని స్పష్టం చేసినా.. మత్స్యకార కుటుంబాల్లో దీనిపై అభద్రతాభావం ఉండేది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ జీవో రద్దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది!

ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్నా పోటీకి ఓకే!:

ఇదే సమయంలో స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో ముగ్గురు పిల్లలు ఉంటే పోటీకి అనర్హులు అనే నిబంధనను తొలగించేందుకు తాజాగా కేబినెట్ ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో... స్థానిక సంస్థలు, సహకార సంఘాల ఎన్నికల్లో ఇద్దరు పిల్లలుకంటే ఎక్కువ ఉండకూడదన్న నిబంధనను తప్పిస్తూ బిల్లు పెట్టాలని నిర్ణయించింది.