బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లో కీలక అప్ డేట్... వీడియో విడుదల!
ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్ లో కీలక ప్రక్రియ పూర్తైందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
By: Tupaki Desk | 25 Nov 2023 3:43 AM GMTసుమారు 500 కి.మీ.కు పైగా ఉన్న దూరాన్ని కేవలం మూడు గంటల లోపు చేరుకునేలా భారత్ లో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... అహ్మదాబాద్ - ముంబయి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ పనులు కూడా ప్రస్తుతం బుల్లెట్ స్పీడ్ తో జరుగుతున్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ఈ ప్రాజెక్ట్ లో కీలక ప్రక్రియ పూర్తైందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
అవును... అహ్మదాబాద్ - ముంబయి మధ్య బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సంబంధించిన కీలక ప్రక్రియ పూర్తయ్యిందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ మేరకు దీనికి సంబంధించిన వీడియోను ఆన్ లైన్ వేదికగా పంచుకున్నారు. ఈ మేరకు... "బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ లో పురోగతి.. 251.40 కి.మీ మేర పిల్లర్లు, 103.24 కి.మీ మేర ఎలివేటెడ్ సూపర్ స్ట్రక్చర్ నిర్మాణం" అని వీడియోను పోస్ట్ చేశారు.
ఇదే సమయంలో గుజరాత్ లో వల్సాద్, నవ్ సారి జిల్లాల్లోని ఆరు నదులపై వంతెనల నిర్మాణం పూర్తి అయిందని.. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన తొలి గిర్డర్ నిర్మాణం 2021 నవంబరు 25న ప్రారంభమైతే.. దీన్ని ఆరు నెలల్లో పూర్తి చేశామని.. ఫుల్ స్పాన్ లాంచింగ్ విధానంతో 100 కి.మీ వయాడక్ట్ నిర్మాణాన్ని ఏడాది కాలంలో పూర్తి చేసినట్లు ప్రాజెక్ట్ ను పర్యవేక్షిస్తున్న జాతీయ హై-స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్.హెచ్.ఎస్.ఆర్.సి.ఎల్) వెల్లడించింది.
ఇదే క్రమంలో... మరోవైపు సూరత్ లో ట్రాక్ బెడ్ నిర్మాణం ప్రారంభమైందని.. దీనికోసం జపనీస్ షింకన్ సేన్ ట్రాక్ నిర్మాణంలో ఉపయోగించిన విధానాన్నే అనుసరిస్తున్నట్లు ఎన్.హెచ్.ఎస్.ఆర్.సి.ఎల్. వెల్లడించింది. ఈ విధానం ఉపయోగించడం భారత్ లో ఇదే తొలిసారి కాగా... ఈ ప్రాజెక్ట్ లో మొత్తం 28 స్టీలు వంతెనలు రానున్నాయని వెల్లడించింది. ఇందులో మొదటి వంతెన నిర్మాణం గుజరాత్ లోని వల్సాద్ జిల్లాలో ప్రారంభమైందని తెలిపింది.
కాగా... ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్ పొడవు 508.17 కిలోమీటర్లు కాగా.. ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తే అహ్మదాబాద్ నుంచి ముంబయి కేవలం 2.58 గంటల్లో చేరుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రయాణంలో గుజరాత్ లో 8 స్టేషన్లు.. మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉన్నాయి. ఈ క్రమంలో బుల్లెట్ ట్రైన్ తొలి ట్రయల్స్ ను 2026లో చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ట్రయల్ రన్ లో భాగంగా గంటకు 350 కి.మీ. వేగంతో ఈ ట్రైన్ పరుగులు పెడుతుందని తెలిపారు.
ఇక ఈ ప్రాజెక్ట్ విలువ రూ.1.08 లక్షల కోట్లు కాగా... దీన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.10 వేల కోట్లు.. గుజరాత్, ముంబయి రాష్ట్ర ప్రభుత్వాలు చెరో రూ.5 వేల కోట్లు ఎన్.హెచ్.ఎస్.ఆర్.సి.ఎల్. కు కేటాయిస్తున్నాయి. ఇక మిగిలిన మొత్తాన్ని జపాన్ గవర్నమెంట్ రుణం అందివ్వనుంది.