ఏకంగా 542 కిలోలు తగ్గిన ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తి ఇతడే..
ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఖలీద్ బిన్ మొహ్సిన్ షరీ వెయిట్ లాస్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సింది
By: Tupaki Desk | 14 Aug 2024 5:30 PM GMTప్రస్తుతం యువతను బాధపెడుతున్న ప్రధాన సమస్యలలో ఊబకాయం ఒకటి. ఒక్కసారి పెరిగిన బరువు తగ్గాలి అంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.. ఎన్ని రకాల ఎక్ససైజులు చేసిన.. ఎన్ని డైట్లు ఫాలో అయిన చాలామంది అస్సలు తగ్గరు.. ప్రస్తుతం మారుతున్న జీవన విధానమే దీనికి కారణం. అయితే సౌదీ అరేబియా కు చెందిన ఖలీద్ విన్ మొహ్సిన్ షరీ బరువు తగ్గి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.
ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత బరువైన వ్యక్తిగా గుర్తింపు పొందిన ఖలీద్ బిన్ మొహ్సిన్ షరీ వెయిట్ లాస్ చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సింది.2013 లో సుమారు 610 కిలోల బరువు ఉన్న ఖలీద్ తీవ్ర అనారోగ్యంతో మూడేళ్లపాటు మంచానపడ్డాడు. అతని అధిక బరువు కారణంగా చిన్న చిన్న పనులకు కూడా కుటుంబ సభ్యులు,స్నేహితుల పై ఆధారపడాల్సి వచ్చేది. ఎవరు తనని కాపాడలేరు అనుకునే సమయంలో ఖలీద్ పరిస్థితి గురించి అప్పటి సౌదీ అరేబియా రాజు అబ్దుల్లాకు తెలిసింది.
అతని పరిస్థితి చూసి బాధపడిన అబ్దుల్లా ఖలీద్‌కు సాయం చేసి ఆతని పరిస్థితి మెరుగు పరచడానికి నిర్ణయించుకున్నాడు. వెంటనే ఖలీద్ కోసం 30 మంది డాక్టర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. రాజు ప్రోత్సాహం తో డాక్టర్స్ అతనికి ట్రీట్మెంట్ ప్రారంభించారు.ఖలీద్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫోర్క్‌లిఫ్ట్, మంచం సహాయంతో సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఫహద్ మెడికల్ సిటీకి తరలించారు.
డాక్టర్స్ పర్యవేక్షణలో అతను గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేశారు. ఆ తర్వాత చాలా కాలం పాటు ఖలీద్ కు ప్రత్యేకమైన డైట్ అందించడం తో పాటు వ్యాయామం కూడా చేయించారు. అలా ప్రత్యేక సంరక్షణలో ఉన్న ఖలీద్ మొదటి 6 నెలల్లో సగానికి సగం బరువు తగ్గాడు.
అలాగే అతనికి ఫిజియోథెరపీ కూడా చేశారు.. సంవత్సరాల కృషి ఫలితంగా 2023 సంవత్సరం చివరి నాటికి ఖలీద్ బరువు 63.5 కిలోలకు చేరుకుంది. అలా చాలా బరువు తగ్గడంతో లూజ్ గా మారిన అతని అదనపు చర్మాన్ని తొలగించడానికి అనేక శస్త్రచికిత్సలు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు అతను ఎంతో ఆనందంగా, పూర్తి ఫిట్ గా ఉన్నాడు.