కేజ్రీవాల్ పై ఖలిస్థానీ ఉగ్రవాది సంచలన వ్యాఖ్యలు!
కాగా ఖలిస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూ.. తాజాగా కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేశారు.
By: Tupaki Desk | 25 March 2024 9:09 AM GMTఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ను ఎనఫోర్సుమెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మార్చి 28 వరకు కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీకి కోర్టు అప్పగించింది. తనకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది.
కాగా ఖలిస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూ.. తాజాగా కేజ్రీవాల్ పై సంచలన ఆరోపణలు చేశారు. 2014 నుంచి 2022 వరకు ఖలిస్తానీ గ్రూపులు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కి సుమారు రూ.133.54 కోట్ల ఆర్థిక సాయం అందించాయని తెలిపాడు. ఈ మేరకు గురు పత్వంత్ సింగ్ పన్నూ మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఖలిస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూ మాట్లాడుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాము నిధులు అందించినందుకు బదులుగా జైలులో ఉన్న ఉగ్రవాది దేవీందర్ పాల్ సింగ్ భుల్లర్ ను విడుదల చేయడానికి హామీ ఇచ్చారని పన్నూ బాంబుపేల్చాడు. కాగా భుల్లర్ 1993 ఢిల్లీ బాంబు కేసులో దోషిగా ఉన్నాడు. ఈ ఘటనలో 9 మంది మరణించగా పలువురుకి గాయాలయ్యాయి.
ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పై గురు పత్వంత్ సింగ్ పన్నూ ఆరోపణలు హాట్ టాపిక్ గా మారాయి. తాము ఆప్ కు నిధులు ఇచ్చినందుకు ఆయన జైలులో ఉన్న ఖలిస్తానీ ఉగ్రవాది దేవీందర్ పాల్ సింగ్ భుల్లర్ ను విడుదల చేస్తారని హామీ ఇచ్చారని పన్నూ ఆరోపిస్తున్నాడు.
కాగా అమెరికాలో ఉంటున్న గురు పత్వంత్ సింగ్ ఖలిస్థానీ ఏర్పాటు ఉద్యమాన్ని అక్కడ నుంచే నడుపుతున్నాడు. ఈ క్రమంలో భారతదేశానికి వ్యతిరేకంగా పలుమార్లు వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. భారత పార్లమెంటును కూలదోస్తానని హెచ్చరికలు జారీ చేశాడు.
ఈ క్రమంలో ఖలిస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూను భారత ప్రభుత్వ ఏజెంట్లు హత్య చేయడానికి ప్రయత్నించారని కొంత కాలం క్రితం అమెరికా హాట్ కామెంట్స్ చేసింది. పన్నూను చంపడానికి భారత్ కుట్ర పన్నిందని వెల్లడించింది. ఈ కుట్ర వెనుక కొందరు భారత ప్రభుత్వ ఏజెంట్లు ఉన్నారని తెలిపింది.
ఈ నేపథ్యంలో గురు పత్వంత్ సింగ్ పన్నూ.. అరవింద్ కేజ్రీవాల్ లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. కాగా ఎన్నో ఏళ్లుగా అమెరికాలోనే ఉంటున్న పన్నూను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది.