ఖలిస్తానీ ఉగ్రవాది హత్య.. ముగ్గురు భారతీయులను అరెస్టు చేసిన ఆ దేశం!
దాదాపు పది నెలల క్రితం ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ నేత, ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగిన సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 4 May 2024 11:03 AM GMTదాదాపు పది నెలల క్రితం ఖలిస్తానీ టైగర్ ఫోర్స్ నేత, ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య జరిగిన సంగతి తెలిసిందే. దీంతో భారత్ – కెనడా మధ్య విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. తమ దేశంలో హర్దీప్ సింగ్ నిజ్జర్ ను భారత ప్రభుత్వ ఏజెంట్లే హత్య చేశారని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం.. దీనికి భారత్ గట్టి కౌంటర్ ఇవ్వడం జరిగిపోయాయి. అంతేకాకుండా కెనడాకు భారత్ తాత్కాలికంగా వీసాల జారీని నిలిపేసింది. అలాగే భారత్ తమ దేశంలో ఉన్న కెనడా దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని ఆల్టిమేటం జారీ చేసింది.
అయినప్పటికీ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మాత్రం భారత్ పై నిందలు వేయడం మానలేదు. అంతేకాకుండా కెనడా మిత్రదేశాలకు భారత్ పైన ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారంతో తమకు ఏ సంబంధం లేదని భారత్ తేల్చిచెప్పింది. ఆధారాలు ఉంటే ఇవ్వాలని కెనడాను కోరింది.
ఈ నేపథ్యంలో హర్దీప్ సింగ్ హత్యకు ముగ్గురు భారతీయులు కారణమని వారిని కెనడా పోలీసులు ఆ దేశంలో తాజాగా అరెస్టు చేశారు. కెనడాలోని ఎడ్మంటన్ ప్రాంతంలో నివాసముంటున్న కరణ్ ప్రీత్ సింగ్ (28), కమల్ ప్రీత్ సింగ్ (22), కరణ్ బ్రార్ (22)లను అరెస్టు చేశారు. ఈ మేరకు రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు అధికారిక ప్రకటన కూడా విడుదల చేశారు. అంతేకాకుండా వారి ముగ్గురి ఫొటోలను విడుదల చేశారు.
కరణ్ ప్రీత్ సింగ్, కమల్ ప్రీత్ సింగ్, కరణ్ బ్రార్ లపై ఫస్ట్ డిగ్రీ హత్య కేసు కింద అభియోగాలు మోపారు. ఈ ముగ్గురు హిట్ స్క్వాడ్ సభ్యులని తెలిపారు. ఈ ముఠాపై అధికారులు గత కొన్ని రోజులుగా నిఘా పెట్టారని.. దర్యాప్తు ఇక్కడితో ముగియలేదని వెల్లడించారు.
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వ్యవహారంలో మరికొంతమంది పాత్ర కూడా ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నామని.. నిందితులందరినీ అరెస్టు చేస్తామని తెలిపారు. మరోవైపు ఈ ముగ్గురికి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్నాయని సమాచారం.
మరోవైపు కెనడా ముగ్గురు భారతీయులను అరెస్టు చేయడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించినట్టు మీడియా కథనాలు చెబుతున్నాయి. కెనడా అరెస్టు చేసిన ముగ్గురికి పాకిస్థాన్ కు చెందిన ఐఎస్‌ఐతో సంబంధాలు ఉన్నాయని అంటున్నారు. వీరు కెనడాలో ఉండి భారత్ కు వ్యతిరేకంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం అన్నట్టు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. అలాగే డ్రగ్స్ దందా నిర్వహిస్తున్నారని చెప్పినట్టు తెలుస్తోంది.
ఇందుకు సంబంధించి తాము అనేక సార్లు ఆధారాలు ఇచ్చినా కెనడా ప్రభుత్వం పట్టించుకోలేదని భారత ప్రభుత్వం చెప్పినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. అలాగే అక్కడి పోలీసు అధికారులు కూడా ఎలాంటి సహకారమందించలేదని చెబుతున్నాయి. హర్దీప్ సింగ్ హత్య వ్యవహారం తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నా కెనడా ప్రభుత్వం వినిపించుకోవడం లేదని భారత్ ప్రభుత్వం చెప్పినట్టు మీడియా కథనాలు వెల్లడించాయి.