మోడీకీ ఇదే గతి!! : ఇటలీ పర్యటనకు బయలు దేరిన వేళ... ఖలిస్తాన్ ఎఫెక్ట్!
అంతేకాదు.. శాంతి దూతగా.. అహింసాయుతమార్గంలో భారత్‌కు స్వాతంత్రం తీసుకువచ్చారన్న గుర్తుతో ఇటలీలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తాన్ ఉగ్రమూకలు ధ్వంసం చేశారు.
By: Tupaki Desk | 12 Jun 2024 2:56 PM GMTప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఇటలీ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ మూడు రోజుల పాటు జరిగే జీ7 దేశాల శిఖరాగ్ర సద స్సుకు ఆయన హాజరు కానున్నారు. ఈ మూడు రోజులు కూడా ఆయన అక్కడే ఉండనున్నారు. వివిధ దేశాల అధినేతలతో ఆయన చర్చలు జరపనున్నారు. ఈ పర్యటనకు ప్రధాని మోడీ అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. దేశంలో మూడో సారి వరుసగా ప్రధాని బాద్యతలు చేపట్టిన తర్వాత.. తొలి వారంలోనే మోడీ చేస్తున్న విదేశీ పర్యటన కావడంతో ఇటలీ పర్యటనను కేంద్రం ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది.
అయితే.. ఈ పర్యటనకు ముందు ఇటలీలో పెను విధ్వంసం చోటు చేసుకుంది. ప్రదాని మోడీ రాకను వ్యతిరేకిస్తున్నట్టు ఖలిస్తాన్ ఉగ్రవాదులు ప్రకటించారు. ఇటలీకి మోడీ రాకూడదని పేర్కొన్నారు. ఆయనను ఎందుకు ఆహ్వానించారంటూ.. ఇటలీ ప్రభుత్వాన్ని కూడా ఖలిస్తాన్ ఉగ్రవాదులు ప్రశ్నించారు.
అంతేకాదు.. శాంతి దూతగా.. అహింసాయుతమార్గంలో భారత్‌కు స్వాతంత్రం తీసుకువచ్చారన్న గుర్తుతో ఇటలీలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఖలిస్తాన్ ఉగ్రమూకలు ధ్వంసం చేశారు. అంతేకాదు.. మోడీ ఇక్కడకు(ఇటలీ) వస్తే.. ఇదే గతి పడుతుందని కూడా హెచ్చరించారు.
మహాత్మాగాంధీ విగ్రహం ధ్వంసం చేసిన ఖలిస్తాన్ ఉగ్రవాదులు.. ఆ విగ్రహం కింద ఏర్పాటు చేసిన దిమ్మపై తమకు మద్దతుగా నినాదాలు(స్థానిక భాషలో) రాశారు. హర్‌దీప్ సింగ్ నిజ్జర్ పేరును పేరును వారు పేర్కొన్నారు. ఈ ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లో ఖలిస్తాన్ ఉగ్రవాదులను ఉపేక్షించకూడదని తేల్చి చెప్పింది.
ఇటలీ అధికారులతో ఈ విషయమై మాట్లాడినట్టు భారత విదేశాంగ శాఖ సెక్రటరీ వినయ్ క్వాత్రా తెలిపారు. గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన కొద్ది గంటల్లోనే ఖలిస్తాన్ మద్దతు దారులు పెద్ద ఎత్తున నినాదాలు చేసి ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.
"ఈ ఘటన మా దృష్టికి వచ్చిన వెంటనే అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపాం. దీనికి సంబంధించిన విచారణ ప్రక్రియ మొదలైంది. గాంధీజీ విగ్రహాన్ని ధ్వంసం చేయాలనుకోవడాన్ని ఏ మాత్రం ఉపేక్షించం. నిందితులపై అవసరమైన చర్యలు తీసుకుంటాం'' అని ఇటలీ ప్రభుత్వం కూడా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మోడీ విదేశీ పర్యటనకు మరింత భద్రత కల్పించాలని ఇటలీని కోరుతూ.. భారత విదేశాంగ శాఖ ఓ లేఖ రాసింది.