Begin typing your search above and press return to search.

ఇజ్రాయెల్ ను క్షమిస్తే.. దైవాగ్రహమే.. ఇరాన్ రణ గర్జన

దాదాపు వెయ్యిమందిని హతమార్చి.. 200 మందిని బందీలుగా తీసుకెళ్లింది.

By:  Tupaki Desk   |   15 Aug 2024 11:29 AM GMT
ఇజ్రాయెల్ ను క్షమిస్తే.. దైవాగ్రహమే.. ఇరాన్ రణ గర్జన
X

ఒకరి పక్కలో ఒకరు బల్లెంలాంటి దేశాలున్న పశ్చిమాసియా అంటే ఎప్పుడూ ఉద్రిక్తతలకు నిలయమే.. ఇజ్రాయెల్ కు పాలస్తీనా ఎప్పుడూ శతరుపక్షమే.. తరచూ కాల్పులు.. అవి శ్రుతిమించితే యుద్ధాలు.. ఇలాంటి సమయంలో ఉన్నట్లుండి గత ఏడాది అక్టోబరులో ఇజ్రాయెల్ పై దారుణ దాడికి దిగింది హమాస్. దాదాపు వెయ్యిమందిని హతమార్చి.. 200 మందిని బందీలుగా తీసుకెళ్లింది. దీంతో ఇజ్రాయెల్ పదినెలలకు పైగా యుద్ధం చేస్తోంది.

ఏప్రిల్ నుంచి కారాలు మిరియాలు

ఈ ఏడాది ఏప్రిల్ లో లెబనాన్ లోని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ పై దాడులకు దిగింది ఇజ్రాయెల్. ఇందులో పలువురు కార్ప్స్ హతమయ్యారు. దీంతో ఇరాన్ అగ్గి మీద గుగ్గిలం అయింది. ప్రతీకారం తప్పదంటూ హెచ్చరించింది. ఈ మేరకు దాడికి దిగింది. అయితే, దీనిని ఇజ్రాయెల్ సమర్థంగా అడ్డుకుంది. ఇదిలా ఉంటే హమాస్‌ రాజకీయ విభాగం అధిపతి ఇస్మాయిల్‌ హనియాను గత నెలో ఇరాన్ లోనే హత్య చేసింది ఇజ్రాయెల్. గతంలో ఇరాన్ అణు శాస్త్రవేత్తల మరణం వెనుక కూడా ఇజ్రాయెల్ ఉన్నదనే వాదనలు వచ్చాయి. తమ దేశానికి అతిథిగా వచ్చిన హనియాను హతమార్చడం ఇరాన్ కు తలవంపులుగా మిగిలింది. దీంతోనే ఇజ్రాయెల్ పై దాడి తప్పదంటూ హెచ్చరికలు చేస్తోంది.

మేం తలొగ్గం.. ప్రతీకారం తప్పదు..

ఇజ్రాయెల్‌ మీద ప్రతీకారం తప్పదని.. ఇందులో ఎవరైనా వెనక్కి తగ్గినా.. రాజీపడినా దేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్‌ అయాతొల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. ఖమేనీ ఇప్పటికే ఇజ్రాయెల్ దాడులు చేయాలని ఆదేశించారు. ఆయన ఎంత చెబితే ఇరాన్ ప్రభుత్వానికి అంత. అలాంటి ఖమేనీ హెచ్చరించి రోజులు గడుస్తున్నా.. దాడులు మాత్రం జరగడం లేదు. ఇక ఇజ్రాయెల్ కు తోడుగా అమెరికా కదులుతోంది. మరోవైపు చర్చలకు తన మిత్ర దేశాలను పురిగొల్పుతోంది.

మానసిక యుద్ధం..

ఇజ్రాయెల్‌ మీద దాడి విషయంలో తాము పునరాలోచించేలా శత్రువు మానసిక యుద్ధం చేస్తున్నారని ఖమేనీ ఆరోపించారు. దీనిని ఎవరిని ఉద్దేశించి చేశారో తెలియడం లేదు. ఇరాన్ కు ఇజ్రాయెల్, అమెరికా బద్ద శత్రువులు. కాగా, రాజకీయ, సైనిక, ఆర్థిక విషయాల్లో ఏమాత్రం వెనక్కి తగ్గినా దేవుడి శిక్ష తప్పించుకోలేరంటూ ఖమేనీ పేర్కొన్నారు. ‘ఆధిపత్య శక్తులకు తలొగ్గే ప్రభుత్వాలు ఒక సంగతి గుర్తుపెట్టుకోవాలి. వాటి పరిమాణం, బలంతో సంబంధం లేకుండా.. ప్రజాశక్తిని ఆకర్షించి.. ప్రత్యర్థి సామర్థ్యాన్ని కచ్చితంగా అంచనావేస్తే దెబ్బకొట్టవచ్చు’’ అని వ్యాఖ్యానించారు. శత్రువు బలాన్ని అతిగా ఊహించుకోవడాన్ని కూడా ఖమనీ తప్పుపట్టారు.

45 ఏళ్లుగా మమ్మల్ని దెబ్బకొట్టే ప్రయత్నం

బ్రిటన్, ఇజ్రాయెల్, అమెరికాలు 1979 నుంచి తమను దెబ్బతీయాలని చూస్తున్నాయని ఖమేనీ ఆరోపించారు. అంటే.. నాలుగున్నర దశాబ్దాలుగా తాము ప్రతిఘటిస్తున్న విషయాన్ని చెప్పారు. ఇజ్రాయెల్‌ మాత్రం ఇరాన్ ఏదైనా దుందుడుకు చర్యకు పాల్పడితే.. కచ్చితంగా బలమైన ప్రతిస్పందన తప్పదని హెచ్చరిస్తోంది.