మున్నేరు 3 బాధితుల కోసం ఏపీ నుంచి 2 హెలికాఫ్టర్లు
ఉమ్మడి ఖమ్మం జిల్లా మున్నేరు వరద తీవ్రత భారీగా ఉండటం తెలిసిందే.
By: Tupaki Desk | 1 Sep 2024 3:28 PM GMTఉమ్మడి ఖమ్మం జిల్లా మున్నేరు వరద తీవ్రత భారీగా ఉండటం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో కుండపోతగా కురిసిన వర్షాలతో ఉమ్మడి జిల్లా మొత్తం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇదిలా ఉంటే.. ఖమ్మం పట్టణంలోని మున్నేరు కన్నెర్రతో ఖమ్మం పట్టణ ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. ఖమ్మం పట్టణంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలు అపార్టుమెంట్లలోకి నీళ్లు చేరుకున్నాయి.
దీంతో.. సహాయ చర్యల కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు. రోడ్లు మొత్తం చెరువులుగా మారాయి. దీంతో.. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదిలా ఉండగా.. మున్నేరు వరదలో చిక్కుకున్న వరద బాధితుల్ని కాపాడేందుకు హెలికాఫ్టర్లను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. విశాఖలోని నేవీ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు.
బాధితుల్ని కాపాడేందుకు ఖమ్మం నగరానికి రెండు నేవీ హెలికాఫ్టర్లను పంపాలని తాము కోరామని భట్టి వెల్లడించారు. కోదాడలో అగ్నిమాపక.. విపత్తు నిర్వహణ టీంలు సహాయక చర్యలు చేపట్టాయి. ఇళ్లల్లో చిక్కుకుపోయిన వారిని బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రెస్క్యూ కోసం హెలికాఫ్టర్లు రావాల్సి ఉంది. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవటంతో.. హెలికాఫ్టర్లు వచ్చే దాని కంటే ముందుగా డ్రోన్ల సాయంతో ఇంటిపైకి ఎక్కి.. సాయం కోసం ఎదురుచూస్తున్న ముగ్గురు యువకులకు సేఫ్టీ జాకెట్లను పంపారు. అయితే.. అనూహ్యంగా వరద తీవ్రతకు ఇంటి గోడ కూలిందని.. లైఫ్ జాకెట్లు ఉన్నాయి కాబట్టి.. బాధితులు క్షేమంగా వస్తారని భావిస్తున్నట్లు మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన కంట నీరు పెట్టుకున్నారు. బాధితులు క్షేమంగా రావాలని ఆయన కోరుకుంటున్నారు.
ఖమ్మం పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకుంది. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు ఉగ్రరూపం దాల్చటంతో ప్రకాశ్ నగర్ వద్ద ప్రమాదకర స్థాయిలో ప్రవహాం ఉంది. దీంతో ఖమ్మం పట్టణంలోని చాలా ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ఇళ్ల మధ్య నుంచి మున్నేరు వాగు ఉధ్రతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నట్లుగా చెబుతున్నారు.