ఖమ్మంలో బీఆర్ఎస్ కు కష్టమేనా ?
కానీ కేసీయార్ ఆపనిచేయకుండా పోతే పోనీలే అన్నట్లుగా వ్యవహరించారు. దాని ప్రభావం రాబోయే ఎన్నికలపై కచ్చితంగా పడుతుంది.
By: Tupaki Desk | 17 Sep 2023 1:30 PM GMTరాబోయే ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో క్లీన్ స్వీప్ కోసం కాంగ్రెస్ పెద్ద వ్యూహాన్నే అమలుచేస్తోంది. తాజాగా మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావును చేర్చుకున్నది. ఇంతకుముందే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా చేర్చుకున్నది. పొంగులేటి, తుమ్మలకు జిల్లా మొత్తం బలమైన మద్దతుదారులు, అనుచరులున్నారు. పాలేరు నియోజకవర్గంలో టికెట్ ఇవ్వలేదన్న కోపంతో తుమ్మల బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. పాలేరులో టికెట్ హామీ ఇవ్వటంతోనే తుమ్మల పార్టీలో చేరారు అనటంలో సందేహంలేదు.
అలాగే పొంగులేటి ఖమ్మంలో పోటీచేయబోతున్నట్లు సమాచారం. ఇక తేలాల్సింది కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం మాత్రమే. నిజానికి తుమ్మల, పొంగులేటి చేరికతో పార్టీ బలోపేతమైనట్లే అనుకోవాలి.
ఎందుకంటే ఇద్దరు కూడా ఆర్ధికంగా, రాజకీయంగా చాలా పటిష్టమైన స్ధితిలో ఉన్నారు. వీళ్ళిద్దరిని వదులుకోవటం కేసీయార్ తప్పనే చెప్పాలి. టీఆర్ఎస్ పెట్టిన దగ్గర నుండి ఏరోజూ పార్టీ జిల్లాపై ప్రభావం చూపలేదు. ఎంతో కీలకమైన రాబోయే ఎన్నికల్లో మెజారిటి సీట్లు గెలవాలని కేసీయార్ నిర్ణయించుకున్నారు.
అలాంటపుడు ఆర్ధికంగా, రాజకీయంగా ఎంతో పటిష్టంగా ఉండే పొంగులేటి, తుమ్మలను వదులుకోవాల్సింది కాదు. వీళ్ళిద్దరిని ఏదో పద్దతిలో పార్టీలో సర్దుబాటు చేసుంటే మెజారిటి సీట్లు బీఆర్ఎస్ కు వచ్చుండేవే.
కానీ కేసీయార్ ఆపనిచేయకుండా పోతే పోనీలే అన్నట్లుగా వ్యవహరించారు. దాని ప్రభావం రాబోయే ఎన్నికలపై కచ్చితంగా పడుతుంది. పార్టీలో ఇఫుడున్న ఎంఎల్ఏలంతా ఇతర పార్టీల నుండి ఫిరాయించిన వారే.
వీళ్ళెవరికీ సొంత బలంలేదు. సత్తుపల్లిలో సండ్ర వెంకటవీరయ్యకు కాస్త జనబలముంది. మిగిలిన వాళ్ళంతా ఒకరకంగా గాలివాటం లేదా డమ్మీలనే చెప్పాలి. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ గెలవటమే కష్టమంటున్నారు. ఇక్కడ అజయ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున పొంగులేటి పోటీచేసే అవకాశముంది. అదే జరిగితే పువ్వాడ ఓటమి తప్పదని బీఆర్ఎస్ లోనే చెప్పుకుంటున్నారు. ఫైనల్ గా తేలాల్సింది కొత్తగూడెం నియోజకవర్గం మాత్రమే. ఇక్కడ జలగం వెంకటరావు ఎందుకనో ఊగుతున్నారు. టికెట్ మీద హామీ దొరికితే జలగం కూడా కాంగ్రెస్ లో చేరుతారేమో తెలీదు.