తుమ్మల వర్సెస్ పువ్వాడ.. ఓ రేంజ్‌లో!!
దీంతో తాజాగా పువ్వాడ ఫైర్ అయ్యారు. తుమ్మలపై విరుచుకుపడ్డారు. నరంలేని నాలుక అంటూ.. తుమ్మలపై విమర్శలు గుప్పించారు
By: Tupaki Desk | 31 Oct 2023 4:30 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన అభ్యర్థులు పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో ఖమ్మం ఒకటి. కరీంనగర్‌లో సీఎం కేసీఆర్-ఈటల రాజేందర్‌ల పోటీ తర్వాత.. ఇప్పుడు అందరి దృష్టీ ఖమ్మంపైనే ఉంది. దీంతో ఇక్కడ బీఆర్ ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు, కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు మధ్య పాలిటిక్స్ పీక్స్ చేరాయి. ఒకరిపై ఒకరు పైచేయి సాదించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు.
ముఖ్యంగా పువ్వాడపై యాంటీ ప్రచారం చేయడంలో తుమ్మల చాలా దూకుడుగా ముందుకు సాగుతు న్నారు. ఖమ్మం అభివృద్ధి అంతా తన హయాంలోనే జరిగిందని, పువ్వాడ ఏం చేశారో చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. అంతేకాదు, క్షేత్రస్థాయిలో తుమ్ల అనుచరులు కరపత్రాలు పంచుతూ.. అభివృద్ధి నాడు-నేడు అంటూ.. వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో పువ్వాడకు.. సెగ బాగానే తగులుతోంది.
దీంతో తాజాగా పువ్వాడ ఫైర్ అయ్యారు. తుమ్మలపై విరుచుకుపడ్డారు. నరంలేని నాలుక అంటూ.. తుమ్మలపై విమర్శలు గుప్పించారు. ''నేను చేసిన అభివృద్థిని తాను చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నాడు'' అని వ్యాఖ్యానించారు. తాను అభివృద్ధి చేయటం వల్లే సూపర్ స్పెషాలిటీ, మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులు ఖమ్మం వచ్చాయని పువ్వాడ తెలిపారు.
''కొత్త కలెక్టరేట్ భవనం, ఐటీహబ్, ప్రభుత్వ మెడికల్ కళాశాల, ధంసలాపురం ఆర్‌వోబీ, నూతన బస్టాండ్, గోళ్లపాడు ఛానెల్, శ్రీశ్రీ సర్కిల్ నుంచి వీవీ పాలెం వరకు రహదారి నిర్మాణం వంటివి నువ్వు చేయించావా? నేను చేయించానా అన్నది తేల్చుకుందాం అడ్డాకు రా!'' అంటూ.. తుమ్మలకు పువ్వాడ ప్రతిసవాల్ రువ్వారు. వచ్చే ఎన్నికల్లో తుమ్మలకు ప్రజలు గుణపాఠం చెబుతారని వ్యాఖ్యానించారు. మొత్తానికి ఖమ్మంలో పువ్వాడ-తుమ్మల పాలిటిక్స్ సలసల మంటున్నాయని అంటున్నారు పరిశీలకులు.