తెలంగాణ హాట్ సీట్ లో అగ్ర నేత కాదు.. మంత్రి సోదరుడు పోటీ?
ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి గతంలో నాదెండ్ల భాస్కరరావు, పీవీ రంగయ్యనాయుడు, రేణుకాచౌదరి వంటి దిగ్గజ నాయకులు ప్రాతినిధ్యం వహించారు
By: Tupaki Desk | 21 Feb 2024 3:30 PM GMTఉమ్మడి రాష్ట్రంలో కానీ.. తెలంగాణ ఏర్పాటయ్యాక కానీ.. ఆ జిల్లా రాజకీయాలు వేరు. మిగతా రాష్ట్రమంతా ఒక పార్టీ గాలి వీస్తే.. ఆ జిల్లాలో మాత్రం వేరే పార్టీ ప్రభావం ఉంటుంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే దీనికి భిన్నమైన ఫలితం వచ్చింది. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పటి నుంచి అక్కడి ఎంపీ సీటు అత్యంత భిన్నమైనది. ఎక్కడినుంచి వచ్చిన నాయకులనైనా ఆదరించే లక్షణం ఆ జిల్లా ప్రజలది. తెలంగాణ వచ్చిన తొలి సందర్భంలో 2014లో జరిగిన ఎన్నికల్లోనూ విలక్షణ తీర్పునిచ్చిన ప్రత్యేకత ఆ సీటుకు సొంతం. ఈ నేపథ్యంలో.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లోనూ తన విశిష్టత నిలుపుకోనుంది.
అగ్ర నేత కాదు.. ఆయన
ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి గతంలో నాదెండ్ల భాస్కరరావు, పీవీ రంగయ్యనాయుడు, రేణుకాచౌదరి వంటి దిగ్గజ నాయకులు ప్రాతినిధ్యం వహించారు. వీరంతా స్థానికేతరులే కావడం గమనార్హం. వీరికిముందు జలగం వెంగళరావు, ఆయన సోదరుడు కొండలరావు సైతం ఇక్కడినుంచి గెలిచారు. వీరూ దశాబ్దాల కిందట ఖమ్మం జిల్లాకు వలస వచ్చినవారే. వెంగళరావు ఉమ్మడి ఏపీకి సీఎం కూడా అవడం విశేషం. ఇక పీవీ రంగయ్య నాయుడు, రేణుకా చౌదరి కూడా కేంద్ర మంత్రులుగా పనిచేశారు. అంతటి ప్రాధాన్యం ఉన్న సీటు నుంచి 2014లో వైఎస్సార్సీపీ తరఫున విజయం సాధించి సంచలనం రేపారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఆ తర్వాత పరిణామాల్లో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. కానీ, 2019లో టికెట్ దక్కలేదు. ఆ ఉక్కపోతను తట్టుకోలేక.. మళ్లీ టికెట్ వస్తుందా? రాదా? అనే సందేహంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంత్రి కూడా అయ్యారు.
పోటీకి దిగేది సోదరుడే..?
ఖమ్మం లోక్ సభ స్థానం ఈసారి హాట్ హాట్ గా మారింది. వాస్తవానికి మొన్నటివరకు ఇక్కడినుంచి కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే, ఆమె ప్రత్యక్ష ఎన్నికల రంగం నుంచి తప్పుకొంటూ రాజ్య సభకు వెళ్లారు. అదే సమయంలో ఖమ్మం మాజీ ఎంపీ రేణుకా చౌదరి కూడా రాజ్య సభకు ఎంపికయ్యారు. దీంతో ఖమ్మంలో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే ప్రశ్న తలెత్తుతోంది. దీనికి సమాధానంగా ఓ మంత్రి సోదరుడి పేరు చెబుతున్నారు. మరో కీలక మంత్రి కూడా తనవారికే ఇవ్వాలని పోటీ పడుతున్నప్పటికీ.. మరో మంత్రి సోదరుడికే ఎక్కువ చాన్స్ ఉన్నట్లుగా సమాచారం. అందులోనూ ఈ మంత్రి సీఎం రేవంత్ కు అత్యంత సన్నిహితులు. అటు పార్టీపరంగానూ మంచి పనితీరు చూపారు. వ్యక్తిగతంగానూ మంచి పేరుంది. ఈ నేపథ్యంలోనే ఆయన సోదరుడికి టికెట్ ఖాయం అంటున్నారు.