ఖమ్మంలో ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ అరాచకం.. రాళ్లతో కొడుతూ వెంటపడ్డారు!
తమకు డబ్బులు ఇవ్వాలని.. అందుకే టూవీలర్ ను తమ వద్దే ఉంచుకున్నట్లుగా బిల్డింగ్ ఓనర్ చెప్పటంతో ఫైనాన్స్ సిబ్బంది ఆగ్రహంతో వినయ్ పై దాడి చేశారు.
By: Tupaki Desk | 6 April 2024 4:40 AM GMTతీసుకున్న అప్పును తీర్చలేదన్న కోపం.. అప్పును తీర్చేందుకు వీలుగా తగిన శాస్తి చేయాలన్న ఉద్దేశంతో ఖమ్మం పట్టణానికి చెందిన ఒక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థకు చెందిన సిబ్బంది వ్యవహరించిన తీరు షాకింగ్ గా మారింది.
ఈ ఉదంతంలో అప్పు తీసుకొని చెల్లించని ఒకరు మరణించటం గమనార్హం. ఖమ్మం పట్టణానికి చెందిన ఖానాపురం హవేలి స్టేషన్ పోలీసుల కథనం ప్రకారం.. అగ్రాకు చెందిన 20 ఏళ్ల వినయ్.. తన తమ్ముడుతో పాటు రాజస్థాన్ కు చెందిన అజయ్ ఠాగూర్ తో కలిసి దానవాయిగూడెంలో ఉంటున్నాడు.
మార్బుల్ పని చేసే కార్మికుడిగా పని చేసే ఇతడు ఖమ్మం పట్టణానికి చెందిన ఒక ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ నుంచి ఒక టూవీలర్లను ఠాగూర్.. వినయ్ లు కొన్నారు.
ఇదిలా ఉంటే.. బల్లేపల్లిలోఒక ఇంటికి మార్బుల్ వేసే పనికి ఒప్పుకున్న ఠాగూర్ రూ.50వేల అడ్వాన్సు తీసుకొని పనికి ఒప్పుకున్నాడు. పనికి వెళ్లకపోవటంతో ఆగ్రహించిన భవన యజమాని టూవీలర్ లాక్కుని తన వద్ద ఉంచుకున్నాడు. దీంతో ఠాగూర్ సొంతూరుకు వెళ్లిపోయాడు.
టూవీలర్ కిస్తీలను కట్టకపోవటంతో ఫైనాన్స్ సంస్థ ప్రతినిధులు వినయ్ ను పట్టుకున్నారు. ఠాగూర్ కు చెందిన టూవీలర్ ను చూపించేందుకు ఫైనాన్స్ సిబ్బందిని బల్లేపల్లికి తీసుకెళ్లాడు. తమకు డబ్బులు ఇవ్వాలని.. అందుకే టూవీలర్ ను తమ వద్దే ఉంచుకున్నట్లుగా బిల్డింగ్ ఓనర్ చెప్పటంతో ఫైనాన్స్ సిబ్బంది ఆగ్రహంతో వినయ్ పై దాడి చేశారు.
దీంతో అతను వారి నుంచి తప్పించుకొని పరిగెత్తాడు.దీంతో.. అతడ్ని టూవీలర్ మీద వెంటాడుతూ.. రాళ్లతో దాడి చేస్తూ పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో గందరగోళానికి గురైన వినయ్.. వారి నుంచి తప్పించుకునేందుకు ఖానాపురం చెరువులోకి దూకాడు.
చాలా దూరం నుంచి పరుగులు తీస్తూ.. ఆయాసంతో ఉన్న అతను లోతుగా ఉన్న చెరువులోకి దూకటంతో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. ఫైనాన్స్ సంస్థలో వినయ్ రూ.4వేలు..ఠాగూర్ రూ.14వేలు అప్పు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.
నాలుగు రోజులుగా వినయ్ ను డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. తక్కువ మొత్తంలో ఇవ్వాల్సిన డబ్బుల కోసం ఇంత దారుణంగా వ్యవహరించటం ఏమిటన్నది ఇప్పుడు చర్చగా మారింది.