ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఆయనే?
ఇండియా కూటమి నాయకుడిగా ఉన్న వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో ఆ కూటమి ప్రధాని అభ్యర్థిగానూ పరిగణించాల్సి వస్తుంది.
By: Tupaki Desk | 13 Jan 2024 12:18 PM GMTపదేళ్లుగా కేంద్రంలో అధికారం చెలాయిస్తోన్న బీజేపీని ఎలాగైనా ఇంటికి పంపాలనే లక్ష్యంతో ఉన్న ప్రతిపక్షాలు ‘ఇండియా’ కూటమిగా ఏర్పడి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రాల్లో పోటీ పడుతున్నా.. జాతీయ స్థాయిలో కలిసి నడిచేందుకు చొరవ చూపుతున్నాయి. ఒకదానికొకటి సర్దుకుపోతున్నాయి. దాదాపు ఏడాదినుంచి సమావేశం అవుతూ వస్తున్నాయి. అయితే, మరొక్క నాలుగు నెలల్లో లోక్ సభ ఎన్నికలు ఉన్నందున కూటమి నాయకుడు ఎవరనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకలేదు.
అటు మోదీ.. ఇటు ఆయన
ఇండియా కూటమి నాయకుడిగా ఉన్న వ్యక్తిని వచ్చే ఎన్నికల్లో ఆ కూటమి ప్రధాని అభ్యర్థిగానూ పరిగణించాల్సి వస్తుంది. కూటమికి అధికారానికి సరిపడా సీట్లు వస్తే.. సహజంగా దాని నాయకుడికే ప్రధాని అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ నరేంద్ర మోదీ ఇప్పటికే పలుసార్లు తాను బీజేపీ తరఫున మూడోసారీ ప్రధాని అభ్యర్థిని అని స్పష్టంగా ప్రకటించారు. ఆయన నోటి నుంచి హ్యాట్రిక్ మాట వస్తోంది. అంటే.. మరోసారి ఎన్డీఏ కూటమి గెలిస్తే మోదీనే ప్రధాని. మరి ఇటువైపు ఇండియాలో ప్రధాని అభ్యర్థి ఎవరో తేలలేదు. దీనిని మోదీ ఇప్పటికే పలుసార్లు ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. దీనిని తిప్పికొట్టేలా ప్రతిపక్షాలు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. కాగా, ఇండియా నేతలు శనివారం వర్చువల్ గా భేటీ అయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సహా పలు పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. కూటమి ఛైర్ పర్సన్‌గా కాంగ్రెస్ మల్లికార్జున్ ఖర్గే ను ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని జాతీయ మీడియా పేర్కొంటోంది.
ప్రధాని అభ్యర్థి ఆయనే..?
ఇండియా కూటమి అధ్యక్ష పదవికి జేడీయూ నేత, బిహార్ సీఎం నీతీశ్ కుమార్ పేరు చాలాసార్లు వినిపించింది. అయితే, ఆయనను కన్వీనర్ గా ఉండమని సూచించగా.. తిరస్కరించినట్లు తెలుస్తోంది. కాస్త ఆగ్రహంగా.. ఈ పదవికి కూడా కాంగ్రెస్ వ్యక్తులనే ఎన్నుకోవాలని సూచించినట్లు సమాచారం. మరోవైపు సీట్ల సర్దుబాటుపై సమావేశంలో నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని సమాచారం. ఇండియా చైర్మన్ గా ఖర్గే ఎంపికవడంతో లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాల ప్రధాని అభ్యర్థిగా కూడా ఆయననే ప్రకటించే అవకాశాలున్నాయి. ఆ మేరకు మమతా బెనర్జీ, కేజ్రీవాల్‌తో పాటు మరికొందరు నేతలు ఇప్పటికే ప్రతిపాదించిన చేశారు.