బీజేపీకి ఈ సారి 400 సీట్లు ఖాయం.. నిండు సభలో కాంగ్రెస్ వెల్లడి!!
సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే.. తాజాగా నోటి దూల ప్రదర్శించారు. సాక్షాత్తూ పార్లమెంటు రాజ్యసభలోనే ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు.
By: Tupaki Desk | 2 Feb 2024 1:21 PM GMTవచ్చే పార్లమెంటుఎన్నికల్లో అధికారంలోకి రావాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సొంత నేతలే.. కుంపటి రాజేస్తున్నట్టు గా ఉంది... పరిస్థితి. అందునా.. పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా వెలుగొందుతున్న సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే.. తాజాగా నోటి దూల ప్రదర్శించారు. సాక్షాత్తూ పార్లమెంటు రాజ్యసభలోనే ఆయన బీజేపీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల ను ఆయన ఏ ఉద్దేశంతో చేశారో తెలియదు కానీ.. అవి మాత్రం బీజేపీకి రక్షణ కవచంగా మారాయి. ఇప్పుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలను బీజేపీ దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుని.. "ఇదిగో.. చూశారా!" అంటూ.. తన ప్రభావాన్ని చెప్పకనే చెప్పుకొంటోంది.
ఏం జరిగింది?
పార్లమెంటులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్ను ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్ సభా.. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఉభయ సభల్లోనూ శుక్రవారం ప్రారంభించారు. ఈ క్రమంలో రాజ్యసభసభ్యుడైన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన ప్రసంగం.. బీజేపీకి బూస్టిచ్చేలా ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఖర్గే చేసిన వ్యాఖ్యలకు.. బీజేపీ సభ్యులు బల్లలు చరుస్తూ.. తమ హర్షాన్ని ప్రకటించారు. అంతేకాదు.. రాజ్యసభలోనే ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిరునవ్వులు చిందిస్తూ.. తమ భవిష్యత్తును ప్రతిపక్ష నాయకుడి నోటి నుంచి విని.. మురిసిపోయారు. మరి ఇంతటి ఘన కార్యం చేసిన .. మల్లికార్జున ఖర్గే ఏమన్నారంటే..
"మీకు 330-334 సీట్లతో మెజారిటీ ఉంది. ఈసారి, అది 400కు పైనే కావొచ్చు" అని ఖర్గే రాజ్యసభ సాక్షిగా వ్యాఖ్యానించారు. సాధారణంగా కాంగ్రెస్ నాయకులు ఎవరు మాట్లాడినా.. బీజేపీకి ఓట్లు సీట్లు కూడా తగ్గుతాయని చెబుతున్నారు. నిన్న మొన్నటి వరకు కూడా ఖర్గే అలానే బయట ప్రచారం చేశారు. కానీ, అనూహ్యంగా ఆయన ఏ కాంటెస్టులో అన్నారో తెలియదు కానీ.. బీజేపీకి ఈ దఫా 400 సీట్లు వస్తాయని చెప్పేశారు. ఇదేమీ .. సాధారణ సభ కాకపోవడం.. పైగా ప్రధాన మంత్రి వంటి దిగ్గజ నేత సభలోనే ఉండడంతో కాంగ్రెస్ నాయకులు అవాక్కయ్యారు.
వాస్తవానికి విపక్ష నాయకులు చేసే విమర్శలకు, కామెంట్లుకు విపక్ష నాయకుల నుంచే హర్షం వ్యక్తమవుతుంది. కానీ, దీనికి భిన్నంగా ఖర్గే చేసిన ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సహా విపక్ష నాయకులు తెల్లబోగా.. బీజేపీ మాత్రం.. హర్షం వ్యక్తం చేస్తూ.. బల్లలు చరుస్తూ.. కొన్ని నిమిషాల పాటు ఆనందంలో మునిగిపోవడం గమనార్హం. మరి నాయకులు ఇలా ఉంటే.. కాంగ్రెస్ ఎలా బతికి బట్టకడుతుందో చూడాలి.