Begin typing your search above and press return to search.

ఏపీలో కాంగ్రెస్ ఫస్ట్ గ్యారెంటీ ఇదే... తెరపైకి వైఎస్సార్ వారసత్వం టాపిక్!

ఖర్గే... ఢిల్లీ నుంచి ఏపీకి ఒరిగిందేమీ లేదని అన్నారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై స్పందించారు.

By:  Tupaki Desk   |   26 Feb 2024 4:37 PM GMT
ఏపీలో కాంగ్రెస్  ఫస్ట్  గ్యారెంటీ ఇదే... తెరపైకి వైఎస్సార్  వారసత్వం టాపిక్!
X

కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ సత్తా చాటాలని కాకపోయినా.. మనుగడ ప్రశ్నార్ధకం కాకుండా కాపాడుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా పూర్వ వైభవం సాధించుకునే ప్రయత్నంలో భాగంగా వైఎస్సార్ కుమార్తె షర్మిళను ఆ పార్టీ ఏపీ ఇన్ ఛార్జ్ గా ప్రకటించింది. ఈ సమయంలో ఎన్నికల ప్రచారానికి తెరలేపింది ఏపీ కాంగ్రెస్.

అవును... ఏపీ కాంగ్రెస్ లోకి ఎంటరవతూ జగన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న షర్మిళ... తాజాగా ఎన్నికల హామీలు దిశగా ప్రచారం మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తాజాగా అనంతపురంలో న్యాయసాధన సభ నిర్వహించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పీసీసీ చీఫ్ షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొన్నారు! ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తన మొదటి గ్యారెంటీని విడుదల చేసింది.

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రతీ రాష్ట్రంలోనూ గ్యారెంటీలను తెరపైకి తెస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను ఇచ్చిన ఆ పార్టీ, తెలంగాణలో ఆరు గ్యారెంటీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఇదే సమయంలో ఏపీలో కూడా అంతకు మించి గ్యారెంటీలు ఉంటాయని చెబుతున్న నేపథ్యంలో... తాజాగా తొలి గ్యారెంటీని ప్రకటించారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఈ మేరకు ప్రకటన చేశారు.

ఈ సందర్భంగా అనంతపురం సభలో మైకందుకున్న ఖర్గే... తాను అనంతపురం సభకు వచ్చింది ధనవంతుల కోసం కాదని, పేద ప్రజల కోసం ఒక పథకాన్ని ప్రకటించడానికని తెలిపారు. ఇందులో భాగంగా "ఇందిరమ్మ అభయ గ్యారెంటీ" పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం ప్రకారం... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతీ పేద కుటుంబానికీ నెలకు ఐదువేల రూపాయల చొప్పున ఇస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా పేద ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఈ తొలి గ్యారెంటీ తమ గుండెల్లో ఉంటుందని చెప్పిన ఖర్గే... ప్రజలు కూడా తమ తమ గుండెల్లో ఉంచుకోవాలని అన్నారు. ఇక.. పదేళ్లుగా ఆంధ్రరాష్ట్ర ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని తెలిపిన ఖర్గే... ఢిల్లీ నుంచి ఏపీకి ఒరిగిందేమీ లేదని అన్నారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై స్పందించారు.

ఇందులో భాగంగా... ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దేశం గర్వించే వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకుడిని అందించిందని అన్నారు. ఈ సమయంలో ఆయన కుమార్తెను ఏపీ కాంగ్రెస్ కి నాయకురాలిని చేశామని తెలిపారు. ఏపీకి ఒక రోజు వైఎస్ షర్మిళ ముఖ్యమంత్రి అవుతారని ఖర్గే జోస్యం చెప్పారు! ఏపీలో జగన్, చంద్రబాబు, పవన్ లు మోడీ ముందు జీ హుజూర్ అంటున్నారని అద్దేవా చేశారు.

అనంతరం మైకందుకున్న షర్మిల... సీఎం జగన్ పై విమర్శలు సంధించారు. ఇందులో భాగంగా ప్రత్యేక హోదా విషయాన్ని ప్రస్థావించారు. ఇదే సమయంలో... ఏ ఒక్క మాటా నిలబెట్టుకోలేని జగన్.. వైఎస్సార్ వారసుడు ఎలా అవుతారు అంటూ షర్మిళ విమర్శించడం గమనార్హం. ఏది ఏమైనా... గ్యారెంటీ ల ప్రకటనలతో కాంగ్రెస్ పార్టీ కూడా ఏపీ ఎలక్షన్స్ కి రెడీ అయిపోయినట్లే అని అంటున్నారు పరిశీలకులు.