Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కుటుంబ పార్టీ : ఖర్గే సంచలన వ్యాఖ్యలు !

అన్ని కులాలు మత్రాలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు అందులో ఉంటారు అంతర్గత ప్రజాస్వామ్యం కూడా కాంగ్రెస్ లో ఎక్కువే.

By:  Tupaki Desk   |   27 Nov 2023 9:02 AM GMT
కాంగ్రెస్ కుటుంబ పార్టీ : ఖర్గే సంచలన వ్యాఖ్యలు  !
X

కాంగ్రెస్ అంటేనే శతాధిక వృద్ధ పార్టీ. ఈ దేశంలో కాంగ్రెస్ కి ఉన్న చరిత్ర మరే పార్టీకి లేదు. 1885లో కాంగ్రెస్ ఆవిర్భవించింది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎదుర్కొని ఈ రోజుకీ కొనసాగుతోంది. కాంగ్రెస్ ముక్త భారత్ అన్నది సాధ్యం కాదని ఎప్పటికప్పుడు చాటుతోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అలా అంతర్భాగం అయిపోయింది.

కాంగ్రెస్ అంటే అందరి పార్టీ అని రుజువు చేసుకుంటూ వస్తోంది. అన్ని కులాలు మత్రాలు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు అందులో ఉంటారు అంతర్గత ప్రజాస్వామ్యం కూడా కాంగ్రెస్ లో ఎక్కువే. ఏ నేత అయినా స్వేచ్చగా అక్కడ తన భావాలను చెప్పగలరు. అలాగే ఏ నేత అయినా ఉన్నత పదవులు ఆశించగలరు. చాలా సార్లు వాటిని అందుకోగలరు కూడా.

అందుకే కాంగ్రెస్ ఈ రోజుకీ దేశంలో అతి ముఖ్యమైన పార్టీగా ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ మీద కుటుంబ పార్టీ అని విమర్శ ఉంది. ప్రత్యర్ధి పార్టీలు అలా కాంగ్రెస్ మీద కామెంట్స్ చేస్తూ ఉంటాయి. బీజేపీ అయితే కాంగ్రెస్ ని కుటుంబ పార్టీ అని అంటూ వస్తోంది. మరి కాంగ్రెస్ కుటుంబ పార్టీ అవునా కాదా అంటే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తాజాగా ఇక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను కుండబద్ధలు కొట్టారు.

కాంగ్రెస్ కుటుంబ పార్టీ కానే కాదు అని ఖర్గే స్పష్టం చేశారు. దానికి ఆయన ఎన్నో ఆధారాలు కూడా చూపించారు. నిజంగా కాంగ్రెస్ కుటుంబ పార్టీ అయితే రాహుల్ గాంధీని రెండు సార్లు ప్రధాని చేసే అవకాశం ఉన్నా ఎలా వదులుకుంటుంది అని ఆయన నిలదీశారు. 2004, 2009లలో కాంగ్రెస్ నాయకత్వంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

ఆనాడు సోనియా గాంధీ కనుక బలంగా తలచుకుంటే కచ్చితంగా రాహుల్ ప్రధాని అయ్యేవారు అన్నది తెలిసిందే. దాని కంటే ముందు సోనియా గాంధీనే ప్రధాని కావాలని అంతా కోరుకున్నారు. ఆమె కాదని చెప్పి ఆ పదవిని మన్ మోహన్ సింగ్ ని ఎంపిక చేశారు. ఇక 2009 నాటికి కూడా రాహుల్ ని ప్రధానిగా చేయలేదు. ఇదే ఇపుడు ఖర్గె చెబుతూ కాంగ్రెస్ ని కుటుంబ పార్టీ అని ఎలా అంటారని విపక్షాలను గట్టిగానే ప్రశ్నిస్తున్నారు.

అంతే కాదు కాంగ్రెస్ నాయకత్వంలో ఏర్పడిన ఏ రాష్ట్ర ప్రభుత్వంలో అయినా సోనియా కుటుంబ సభ్యులు కీలకమైన పదవులు తీసుకున్నారా అని ఖర్గే మరో ప్రశ్న కూడా వేస్తున్నారు. అవన్నీ పక్కన పెడితే కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవిని కూడా ఖర్గేకి ఈ మధ్యనే కట్టబెట్టి గాంధీ కుటుంబం పార్టీ పదవులకు కూడా దూరంగా ఉంది.

ఒక విధంగా చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలో గాంధీ ఫ్యామిలీ మూడున్నర దశాబ్దాలుగా ఎలాంటి అధికార పదవులు అనుభవైంచడంలేదు. 1989 డిసెంబర్ లో పార్లమెంట్ కి ఎన్నికలు జరిగాయి. అప్పటిదాకా రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడింది. దాంతో నాటి నుంచి కాంగ్రెస్ కుటుంబం అధికార పదవులు ఏవీ నేటి దాకా చేపట్టలేదని అంతా గుర్తు చేస్తున్నారు.

ఇక ఖర్గె మరో మాట అన్నారు. తెలంగాణాలో బీయారెస్ అధికారంలో ఉంది కీలక పదవులు అన్నీ కుటుంబ సభ్యులకే కేసీయార్ కట్టబెట్టారు అని. అలాగే పార్టీ పదవులలో ఎవరున్నారు అన్నది కూడా తెలిసిందే అంటున్నారు.

మరి ఈ విధంగా ఆలోచిస్తే కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాదు అని ఎవరైనా అంటారని ఖర్గే అంటున్నారు. అయినప్పటికీ కాంగ్రెస్ ని కుటుంబ పార్టీ అని ఎవరైనా అంటే మాత్రం వారంత మూర్ఖులు ఎవరూ ఉండరని కూడా ఖర్గే స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ ని కుటుంబ పార్టీ అని అనకూడదు అని ఖర్గే అంటున్నారు. వాస్తవాలు చూస్తే అలాగే ఉన్నాయని అంతా అంటున్నారు.