273 సీట్లు మావే.. మోడీని ఓడిస్తాం: ఖర్గే
రాహుల్‌కు ఈ దేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో బలమైన రోడ్ మ్యాప్ ఉందన్నారు.
By: Tupaki Desk | 31 May 2024 2:02 PM GMTసార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీదే విజయమని ఆ పార్టీ ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. ఏడు దశల ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత.. ఆయన వరుసగా 8 టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూలుఇచ్చారు. దీనిలో ఆయన పేర్కొన్న విషయాల్లో కామన్ పాయింట్లు రెండు ఉన్నాయి. ప్రధాన మంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీనే తన ప్రధాన ఛాయిస్ అని వెల్లడించారు. ఆయన తన భారత్ జోడో యాత్రతో ఈ దేశం మొత్తం తిరిగి వచ్చారని తెలిపారు. యువతకు ప్రతినిధిగా ఉన్నారని చెప్పారు. రాహుల్‌కు ఈ దేశాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో బలమైన రోడ్ మ్యాప్ ఉందన్నారు. అందుకే రాహుల్ అయితే బెటర్ అని చెప్పారు.
అయితే.. ఇది తన స్వొంత అభిప్రాయమని ఖర్గే చెప్పారు. ఇండియా కూటమి గెలిచిన తర్వాత.. దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటా రన్నారు.ఇక,ప్రస్తుత ఎన్నికల్లో ఇండియా కూటమి 273 స్థానాల్లో ఘన విజయం దక్కించుకుంటుందని ఖర్గే తెలిపారు. తాము అంటే..కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే 100 నుంచి 128 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన ఆరుద శల పోలింగ్‌లో 100 సీట్లు తమకు ఏకపక్షంగా దక్కాయని.. శనివారం జరగనున్న ఏడో దశ పోలింగ్‌లో మరో 28-35 సీట్లు దక్కుతాయని చెప్పారు. హీనపక్షం 28 చోట్ల విజయం దక్కించుకుంటామన్నారు. దీంతో బీజేపీని మట్టికరిపిస్తామని చెప్పారు.
తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రధాని నరేంద్ర మోడీ ధ్యానం చేయడంపైనా ఖర్గే విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఇదొ క నాటకమని పేర్కొన్నారు. ఇంట్లో కూర్చుని కూడా ధ్యానం చేయొచ్చని.. పూజలు కూడా చేసుకోవచ్చని.. కానీ, ప్రజాధనంతో జీతాలు ఇచ్చే 10 వేల మంది పోలీసులను భద్రతగా పెట్టుకుని ఇలా ధ్యానం చేయడం ఎందుకని ప్రశ్నించారు. ఇదంతా ఓ నాటకమని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో రాజ్యాంగాన్ని తప్పుదోవ పట్టించారని చెప్పారు.
ప్రజల సమస్యలను ప్రస్తావించి.. వాటి పరిష్కారాలు చూపించాల్సిన ప్రధాని.. వాటిని వదిలేసి.. విద్వేష పూరిత ప్రసంగాలు చేశారని ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రజల విశ్వాసాన్నిపూర్తిగా పోగొట్టుకున్నారని వ్యాఖ్యానించారు. తమ విజయాన్ని.. బీజేపీ ఓటమిని ప్రజలు ఆరు దశల ఎన్నికల్లోనే నిర్ణయించారని తెలిపారు. ఏడో దశలోనూ ఇదే జరుగుతుందని ఖర్గే వ్యాఖ్యానించారు.