కొలిక్కివస్తున్న కియా కేసు.. ఐదేళ్లుగా ఇంటిదొంగల చేతివాటం!
కియా పరిశ్రమలోని కారు ఇంజిన్ల మాయం కేసు ఓ కొలిక్కి వస్తోంది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో డీజీపీ కార్యాలయమే రంగంలోకి దిగింది.
By: Tupaki Desk | 13 April 2025 9:44 AMకియా పరిశ్రమలోని కారు ఇంజిన్ల మాయం కేసు ఓ కొలిక్కి వస్తోంది. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో డీజీపీ కార్యాలయమే రంగంలోకి దిగింది. డీజీపీ ప్రత్యేక పర్యవేక్షణలో సుమారు 20 మందితో ప్రత్యేక పోలీసు బృందం కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ వ్యవహారంలో కీలక నిందితుడిగా కియా పరిశ్రమలో పనిచేస్తున్న తమిళనాడు వాసిని గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. పరిశ్రమలో మొత్తం 940 కారు ఇంజిన్లు మాయం అవ్వగా, అన్నీ ఒక్కసారే చోరీ అవ్వలేదని నిందితులు, దపదపాలుగా ఇంజిన్లు తరలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సుమారు ఐదేళ్లుగా ఈ వ్యవహారం నడుపుతున్నారని, ఒక్కో కారు ఇంజిన్ విలువ రూ.2.50 లక్షలు ఉంటుందని చెబుతున్నారు. మొత్తం రూ.23.50 కోట్లను ఇంటి దొంగలు దోచేశారని కియా యాజమాన్యం చెబుతోంది.
సత్యసాయి జిల్లా పెనుగొండ మండలంలో ఉన్న కియా పరిశ్రమలో కారు ఇంజిన్ల దొంగతనం కేసులో ఏ1గా కియా ఉద్యోగి ని పోలీసులు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. గత ఏడాది డిసెంబరు 12న ఒక ఉద్యోగి విధులు నిర్వహించే చోటు వద్ద కాకుండా, వేరే చోట సంచరించినట్లు కియా పరిశ్రమ ప్రతినిధులు గుర్తించారు. అతడి కదలికపై సీసీ కెమెరాల ద్వారా పరిశీలించగా, 940 కారు ఇంజిన్ల మాయం వెనుక అతడే కీలక సూత్రధారి అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. ఇంజన్ షాప్ మొబిస్ గేట్ వద్ద అనధికారిక వాహనాలు సంచరించే సమయంలో అతడు ఉన్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని పోలీసులు నిర్ధారించుకున్నారు. దీంతో తమిళనాడులో ఉన్న అతడిని అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అతడు ఇచ్చిన సమాచారం మేరకు ఇతరుల అదుపులోకి తీసుకునేందుకు వేట కొనసాగిస్తున్నారని చెబుతున్నారు.
ఈ ఏడాది జనవరిలో చేపట్టిన వార్షిక తనిఖీల్లో పరిశ్రమలో 940 ఇంజిన్ల లెక్క సరిపోలడం లేదని పరిశ్రమ ప్రతినిధులు గుర్తించారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న కియా యాజమాన్యం అంతర్గత విచారణ చేపట్టింది. అయితే అసలు దొంగలు ఎవరో అనేది తేలకపోవడంతో గత నెల 19న కియ ఇండస్ట్రియల్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం ప్రభుత్వానికి చేరడంతో సిట్ ఏర్పాటుకు ఆదేశించింది. డీజీపీ పర్యవేక్షణలో కేసును వేగంగా కొలిక్కి తేవాలని ఆదేశించడంతో పోలీసులు ఈ కేసును సవాల్ గా తీసుకున్నారని చెబుతున్నారు. దీంతో ప్రధాన అనుమానితుడును అదుపులోకి తీసుకున్న పోలీసులు మొత్తం కుట్రను ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు.
కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు పలు కీలక అంశాలను గుర్తించినట్లు చెబుతున్నారు. ప్రధానంగా చోరీ వెనుక ఓ రాష్ట్రం వారి పాత్రే ఎక్కువగా ఉందని అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు సలీం తమిళనాడు వాసిగా గుర్తించిన పోలీసులు.. మిగిలిన నిందితుల్లో ఎక్కువ మంది ఆ రాష్ట్రం వారే ఉన్నారని అంటున్నారు. కియా పరిశ్రమలో తమిళనాడు వారే ఎక్కువగా పనిచేస్తున్నారు. దీంతో నిందితులు అంతా ఒకరికి ఒకరు సహకరించుకుని దోపిడీకి పాల్పడినట్లు భావిస్తున్నారు. కియాలో మొత్తం 54 ప్లాంట్లు ఉన్నాయి. ప్రధాన పరిశ్రమకు అనుబంధంగా మరికొన్ని అనుబంధ యూనిట్లు పనిచేస్తున్నాయి. ఇక్కడ గంటకు 58 కార్లను తయారు చేస్తారు. రూ.వేల కోట్ల లావాదేవీలు, వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. దీంతో తొలుత నిందితులను గుర్తించడంలో జాప్యం జరిగిందని అంటున్నారు. వేలాది మంది పనిచేస్తున్న పరిశ్రమలో దొంగలను గుర్తించడం తమతో కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది కియా యాజమాన్యం. దీంతో గత నెల 19న పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత కేసు దర్యాప్తులో వేగం పెరిగి నిందితుల గుట్టు రట్టైందని అంటున్నారు.