విజయ్ మాల్యా, నీరవ్ మోడీలను అప్పగించండి!
ఈ సందర్భంగా.. భారత్ నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరస్థులు విజయ్ మాల్యా, నీరవ్ మోడీలను భారత్‌కు అప్పగించాలని ఆయన కీర్‌కు విన్నవించారు.
By: Tupaki Desk | 19 Nov 2024 1:30 PM GMTవిదేశీ పర్యటనలో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. బ్రెజిల్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న జీ-20 సదస్సులో పాల్గొన్నారు. ప్రపంచ దేశాలు ఐక్యంగా ఉండాలని, యుద్ధాలకు ఇది సమయం కాదని పేర్కొన్నారు. ఆర్థిక నేరస్తులను కూడా కాపాడడానికి వీల్లేదని ప్రధాని ఉద్ఘాటించా రు. ఇక, ఈ సదస్సుకు అతిథులుగా వచ్చిన పలు దేశాల ప్రధానులు, అధ్యుక్షులతోనూ ప్రధాని ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ క్రమంలో బ్రిటన్ నూతన ప్రధాని కీర్ స్మార్టర్‌తో దాదాపు రెండు గంటల పాటు ప్రధాని మోడీ ప్రత్యేకం గా చర్చలు జరిపారు. ఈ సందర్భంగా.. భారత్ నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న ఆర్థిక నేరస్థులు విజయ్ మాల్యా, నీరవ్ మోడీలను భారత్‌కు అప్పగించాలని ఆయన కీర్‌కు విన్నవించారు. ఇలాంటివారి విషయంలో తమకు సహకరించాలని సూచించారు. ఆర్థిక నేరస్థులు.. సమాజానికే కాకుండా.. ప్రపంచానికి కూడా ప్రమాదకరమని వెల్లడించారు.
విజయ్‌మాల్యా, నీరవ్ మోడీలపై భారత్‌లో ఆర్థిక నేరాలు నమోదయ్యాయని సుప్రీంకోర్టులోనూ కేసులు నడుస్తున్నాయని ప్రధాని వివరించారు. వీరితోపాటు వీరికి సహాయకారిగా, మధ్యవర్తిగా ఉన్న సంజయ్ భండారీ కూడా బ్రిటన్‌లో తల దాచుకుంటున్నట్టు చెప్పారు. ఆయనను కూడా భారత్‌కు అప్పగించాలని కోరారు. ఆర్థిక నేరస్థులను ఉపేక్షించరాదని కీర్‌కు తెలిపారు. వీరిని తమకు అప్పగించడం ద్వారా భారత్-బ్రిటన్ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ప్రధాని వివరించారు.