జనసేనలో జోష్.. మరో వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేరిక!
పొన్నూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
By: Tupaki Desk | 21 Sep 2024 9:39 AM GMTఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయిన వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేన పార్టీలో చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. ఇదే క్రమంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఇలా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి రాజీనామా చేస్తున్నారు.
తాజాగా వైసీపీకి మరో షాక్ తగిలింది. పొన్నూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు అయిన కిలారి రోశయ్య 2009లో తొలిసారి రాజకీయాల్లోకి ప్రవేశించారు. ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009 ఎన్నికల్లో గుంటూరు జిల్లా తెనాలి నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు.
2019లో వైసీపీలో చేరిన కిలారి రోశయ్య గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ ను ఓడించారు.
కాగా 2024 ఎన్నికల్లో కిలారి రోశయ్యను వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి ఎంపీగా పోటీ చేయించారు. అయితే కిలారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆయనపైన టీడీపీ ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ విజయం సాధించారు.
ఎంపీగా పోటీ చేయడానికి ఇష్టం లేకపోయినప్పటికీ బలవంతంగా జగన్ తనను పోటీ చేయించారని కిలారి రోశయ్య అప్పట్లోనే ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి వైసీపీకి దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల వైసీపీకి రాజీనామా ప్రకటించారు. తాజాగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
ఈ మేరకు తన అనుచరులతో కిలారి రోశయ్య మంతనాలు జరిపారు. వారంతా జనసేన పార్టీలో చేరాలని సూచించడంతో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు కొద్ది రోజుల్లో మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో రోశయ్య పార్టీలో చేరతారని చెబుతున్నారు.
కాగా కిలారి వెంకట రోశయ్య మామ కేంద్ర మాజీ మంత్రి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రస్తుతం వైసీపీలోనే కొనసాగుతున్నారు. ఆ పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు.
కిలారి రోశయ్య తండ్రి కోటేశ్వరరావు గతంలో గుంటూరు మిర్చి మార్కెట్ యార్డు కౌన్సిలర్ గా, చైర్మన్ గా పనిచేశారు. అలాగే 1989లో గుంటూరు–2 అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
ఇక రోశయ్య 1993లో గుంటూరు మిర్చి యార్డు సంఘం ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 1994లో గుంటూరు మిర్చి యార్డు సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వైసీపీలో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు.