ఎవరీ కిలారు రాజేశ్.. తాజాగా హైదరాబాద్ లో ఏం జరిగింది?
తనను ఎవరో వెంబడిస్తున్నారని.. గుర్తు తెలియని వ్యక్తులు తనను ఫాలో కావటమే కాదు.. తనను బెదిరింపులకు దిగుతున్నట్లుగా కంప్లైంట్ ఇచ్చారు.
By: Tupaki Desk | 9 Nov 2023 6:06 AM GMTఏపీ రాజకీయ వర్గాల్లో తరచూ వినిపించే పేరు కిలారు రాజేశ్. విపక్ష నేత చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్ కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు పేరుంది. తాజాగా ఆయన జూబ్లీహిల్స్ పోలీసుల్ని ఆశ్రయించారు. తనను ఎవరో వెంబడిస్తున్నారని.. గుర్తు తెలియని వ్యక్తులు తనను ఫాలో కావటమే కాదు.. తనను బెదిరింపులకు దిగుతున్నట్లుగా కంప్లైంట్ ఇచ్చారు. అంతేకాదు.. దానికి సంబంధించిన ఆధారాల్ని సైతం పోలీసులకు ఇవ్వటంతో ఈ అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. దీనికి మరో కారణం ఉంది. చంద్రబాబు జైలుకు వెళ్లటానికి కారణమైన స్కిల్ డెవలప్ మెంట్ కేసులో కిలారు రాజేశ్ కూడా నిందితుడు కావటం గమనార్హం.
పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్ ను చూస్తే.. జూబ్లీహిల్స్ నివాసి అయిన కిలారు రాజేవ్.. మంగళవారం మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో తన ఇంటి నుంచి ప్రశాసన్ నగర్ బస్టాప్ వద్ద ఉన్న తన కొడుకకును తీసుకొచ్చేందుకు కారులో బయలుదేరారు. అదే సమయంలో కొందరు వైట్ ఫార్చునర్ వాహనంలో ఫాలో అయ్యారు. అనుమానాస్పద రీతిలో తనను ఫాలో అవుతున్న వారిని గుర్తించిన రాజేశ్.. వెంటనే ఇంటికి ఫోన్ చేసి బాబును తీసుకెళ్లాల్సిందిగా భార్యకు చెప్పారు.
తొలుత వైట్ ఫార్చునర్ ఒక్కటే తనను ఫాలో అవుతున్నట్లుగా రాజేశ్ భావించారు. కానీ.. మరో రెండు టూ వీలర్ మీద కూడా ఫాలో అవుతున్నట్లుగా గుర్తించారు. దీంతో.. ఎక్కడా తన కారును ఆపకుండా రాయదుర్గం.. ముంబయి హైవే.. హైటెక్ సిటీ.. నానక్ రాం గూడ జంక్షన్.. మణికొండ.. ఫిలింనగర్.. జూబ్లీహిల్స్ చెక్ పోస్టు మీదగా ప్రయాణించారు. ఈ ప్రాంతాలన్నింటికి తనను ఫాలో అయ్యారని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబరు 36 వద్దకు వచ్చినప్పుడు మాత్రం ఒక టూవీలర్ మీద ఉన్న వ్యక్తి.. కారుకు అడ్డంగా తన వాహనాన్ని పెట్టగా.. ఎందుకు తనను ఫాలో అవుతున్నారని అతడ్ని రాజేశ్ ప్రశ్నించారు.
మిమ్మల్ని సార్.. ఏం చేయమని అడిగారో అదంతా చేయటం మంచిదని చెప్పాడు. దీంతో.. మీ సార్ ఎవరు? ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు? అని ప్రశ్నించగా.. 'మా సార్ ఎవరో మీకు తెలుసు. నీకన్ని తెలుసు' అంటూ బెదిరింపులకు దిగుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు తనను బెదిరించిన వైనంపై కిలారు రాజేశ్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడ్ని ఫాలో అయిన వాహనాల నెంబర్లను పరిశీలించగా ఫేక్ అని తేలినట్లుగా చెబుతున్నారు. దీంతో.. కిలారు రాజేశ్ ను ఫాలో అయ్యిందెవరు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.