జగన్ "కృప" లేకపోవడంతోనే కాంగ్రెస్ లోకి!
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన సామాజికవర్గాల్లో ఒకటిగా కళింగ కులస్తులు ఉన్నారు.
By: Tupaki Desk | 5 April 2024 9:34 AM GMTఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన సామాజికవర్గాల్లో ఒకటిగా కళింగ కులస్తులు ఉన్నారు. ప్రస్తుతం అధికార వైఎస్సార్సీపీలో ఉన్న ఈ సామాజికవర్గం నేత, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కడప జిల్లాలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమెకు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. కృపారాణి తోపాటు ఆమె భర్త కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
2009 పార్లమెంటు ఎన్నికల్లో శ్రీకాకుళం నుంచి తొలిసారి కాంగ్రెస్ ఎంపీగా గెలిచి కిల్లి కృపారాణి సంచలనం సృష్టించారు. అదే స్పీడ్ తో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో కేంద్ర సహాయ మంత్రిగానూ పదవిని ఒడిసిపట్టారు.
2004లో టీడీపీ దివంగత నేత ఎర్రం నాయుడుపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కృపారాణి ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో అదే ఎర్రం నాయుడుని ఓడించారు. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం ఎర్రం నాయుడు కుమారుడు రామ్మోహన్ నాయుడుపై ఓటమిపాలయ్యారు. అంతేకాకుండా ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కిల్లి కృపారాణి మూడో స్థానంలో మాత్రమే నిలిచారు. రెండో స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రెడ్డి శాంతి నిలిచారు.
ఇక 2019 ఎన్నికల్లో కిల్లి కృపారాణికి సీటు దక్కలేదు. వైఎస్సార్సీపీలో చేరినప్పటికీ ఆ పార్టీ తరఫున శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో కళింగ సామాజికవర్గానికే చెందిన దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేశారు. అయితే రామ్మోహన్ నాయుడు చేతిలో దువ్వాడ తక్కువ మెజారిటీ (6653)తో ఓడిపోయారు. మరోవైపు ఇటీవల కాలం వరకు శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలిగా ఉన్న కిల్లి కృపారాణి స్థానంలో మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ కు సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు.
అంతేకాకుండా గతంలో జగనన్న అమ్మ ఒడి నిధులను జమ చేయడానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఆ సందర్భంగా హెలిప్యాడ్ లోకి కిల్లి కృపారాణిని పోలీసులు అనుమతించలేదు. హెలిప్యాడ్ లో సీఎంకు స్వాగతం పలికేవారి లిస్టులో ఆమె పేరు లేదంటూ అడ్డుకున్నారు. దీంతో ఆమె ఆగ్రహంతో వెనుదిరిగారు. విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆమెకు నచ్చచెప్పడానికి ప్రయత్నించినా ఆమె వినిపించుకోలేదు.
ఈ నేపథ్యంలో తనకు వచ్చే ఎన్నికలలో సీట్ దక్కకపోవడం, పార్టీలో జరుగుతున్న అవమానాలతో కృపారాణి వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తారని టీడీపీలో చేరతారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే ఆమె తన మాతృ పార్టీ కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీ తరపున పాతపట్నం లేదా నరసన్నపేట నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారని సమాచారం. ఈ నేపథ్యంలో కిల్లి కృపారాణి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాల్సిందే.