Begin typing your search above and press return to search.

ఉ.కొ. - ద.కొ. మధ్యలో ఓ డ్రోన్... ఏమిటీ కొత్త రచ్చ?

వివరాళ్లోకి వెళ్తే... తాజాగా దక్షిణ కొరియాకు చెందిన ఓ డ్రోన్ తమ భూభాగంలో కనిపించిందని కిమ్ సర్కార్ పేర్కొంది.

By:  Tupaki Desk   |   20 Oct 2024 4:01 AM GMT
ఉ.కొ. - ద.కొ. మధ్యలో ఓ డ్రోన్... ఏమిటీ  కొత్త రచ్చ?
X

నేను ఎవరినైనా గిల్లుతాను కానీ.. నన్ను ఎవరైనా ముట్టుకున్నా ఊరుకోను అన్నట్లుగా ఉంటుంది ఉత్తర కొరియా నియంత కిమ్ వ్యవహారం అంటుంటారు. ఇంతకాలం దక్షిణకొరియాపై వరుసగా చెత్త బెలూన్లు పంపించిన కిమ్ సర్కార్.. వారి భూభాగంపై దక్షిణ కొరియాకు సంబంధించిన ఓ డ్రోన్ కనిపించేసరికి సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. యుద్ధ హెచ్చరిక కూడా చేశారు.

అవును.. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనే చెప్పాలి. పైగా నిన్న మొన్నటి వరకూ అటు నుంచి పాంప్లెట్లు, పోస్టర్లు.. ఇటు నుంచి చెత్త బెలూన్ల మధ్య జరిగిన గిల్లికజ్జాల్లాంటి వ్యవహరం ఇప్పుడు కాస్త తీవ్రమవుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. తాజాగా కిమ్ నోట యుద్ధం అనే మాట కూడా వినిపించింది.

వివరాళ్లోకి వెళ్తే... తాజాగా దక్షిణ కొరియాకు చెందిన ఓ డ్రోన్ తమ భూభాగంలో కనిపించిందని కిమ్ సర్కార్ పేర్కొంది. దీనికి సంబంధించిన ఫోటోను ఆ దేశ అధికారిక మీడియా విడుదల చేసింది. ఈ సందర్భంగా... రాజధానిలో జరిపిన సాధారణ సొదాల్లో ఈ డ్రోన్ ను కనుగొన్నట్లు కిమ్ సర్కార్ తెలిపింది. దక్షిణ కొరియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

ఇందులో భాగంగా.. మరోసారి తమ గగనతలంపై డ్రోన్ ఎగిరినా, సరిహద్దు నిబంధనలు ఉల్లంఘించినా దాన్ని యుద్ధ ప్రకటనగా పరిగణిస్తామని తెల్లిపింది. ఇదే సమయంలో... ప్రతీకార దాడులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఇది దక్షిణ కొరియా సైనిక కవాతులో ప్రదర్శించిన రకం డ్రోన్ అని ఉ.కొరియా మిలటరీ, స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు సంయుక్తంగా నిర్ధారించాయి.

ఈ సందర్భంగా స్పందించిన దక్షిణ కొరియా... దీనిపై స్పందించాల్సిన అవసరం లేదని.. ఇది పూర్తిగా ఏకపక్ష ఆరోపణ అని కొట్టిపారేసింది!

రష్యా తరుపున కిమ్ సైన్యం!:

రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఉత్తర కొరియా ఎంట్రీ ఇచ్చిందనే చర్చ తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... రష్యాకు మద్దతుగా ఉ.కొరియా తన సైనికులను పంపిస్తోందని ఉక్రెయిన్ ఆరోపించింది. దీనికి సంబంధించిన సాక్ష్యంగా ఓ వీడియోను విడుదల చేసింది. ఇది నెట్టింట వైరల్ గా మారింది.

సుమారు 11,000 మంది ఉ.కొరియా సైన్యం రష్యాలో శిక్షణ తీసుకుంటుందని అంటున్నారు. దీంతో... ఈ యుద్ధంలో ఉత్తర కొరియా కూడా పాల్గొంటోందన్న విషయాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకెళ్లడానికి.. పశ్చిమ దేశాల నుంచి మరింత ఆయుధ సహాయాన్ని పొందడానికి ఈ వీడియోను ఉక్రెయిన్ ఉపయోగించుకునే అవకాశం ఉందని అంటున్నారు.