Begin typing your search above and press return to search.

అణు 'కిమ్'కరుడు... మరో భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు!

ప్రధానంగా అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణులను వేగంగా తయారు చేయిస్తున్నారు కిమ్.

By:  Tupaki Desk   |   18 Nov 2024 5:45 AM GMT
అణు కిమ్కరుడు... మరో భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు!
X

ప్రస్తుతం ఉక్రెయిన్ తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు సైనిక సహాయం చేస్తోన్న ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఇప్పుడు కొరియా ద్వీపకల్పంలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీస్తోంది. ఇందులో భాగంగా.. అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలు అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు!

అవును... ఈ సారి రెండు బలమైన దేశాల మధ్య యుద్ధం వస్తే కచ్చితంగా అణ్వాయుధాలను బయటకు తీస్తారని.. దీంతో మూడో ప్రపంచయుద్ధం.. ఫలితంగా భూమిపై మనిషి మనుగడ ప్రశ్నార్థకం అవుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో... అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలు తయారు చేయాలంటూ కిమ్.. తన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పుడు ఈ విషయం తీవ్ర సంచలనంగా మారింది. వాస్తవానికి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచీ కిమ్ ఈ తరహా దూకుడు పెంచారనే చెప్పాలి. అగ్రరాజ్యాన్ని అడ్డుకునేందుకు కిమ్ ఈ స్థాయిలో వ్యూహాన్ని రచిస్తున్నారని అంటున్నారు. దక్షిణ కొరియా, అమెరికాపై దాడి చేయడానికే తన శక్తి సామర్థ్యాలను కిమ్ వేగంగా పెంచుకుంటున్నారని అంటున్నారు.

ప్రధానంగా అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణులను వేగంగా తయారు చేయిస్తున్నారు కిమ్. ఈ క్రమంలో... త్వరలో ఉత్తర కొరియా న్యూక్లియర్ బాంబు పరీక్ష నిర్వహించవచ్చని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థలు ఇటీవల నివేదికలు ఇచ్చిన పరిస్థితి. ఆ నివేదికలకు బలం చేకూరుస్తూ అన్నట్లుగా కిమ్ తాజా నిర్ణయం ఉంది!

ఈ నేపథ్యంలో... ఇటీవల తన అధికారులతో సమావేశమైన కిమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా... రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్ కు అమెరికా సహకరించడాన్ని ఆయన విమర్శించారు. ఉక్రెయిన్ ను పశ్చిమదేశాలు పావుగా వాడుకుంటున్నాయని.. అమెరికా తన పలుకుబడిని పెంచుకోవడానికి ఈ యుద్ధాన్ని ఆయుధంగా మలుచుకొందని ఆరోపించారు.

అయితే... తాను రష్యాకు చేస్తున్న సహకారంపై మాత్రం కిమ్ స్పందించలేదు! ఇదే సమయంలో... దక్షిణకొరియాతో కలిసి అమెరికా అణ్వస్త్ర వ్యూహాలకు పదునుపెట్టడాన్ని ఖండించిన కిమ్.. జపాన్ తో కలిసి ఆసియా నాటో ఏర్పాటు ఆలోచననూ తప్పుబట్టారు. ఇలా కిమ్ చేస్తోన్న కామెంట్లు, తీసుకుంటున్న నిర్ణయాలు, అధికారులకు ఇస్తున్న ఆదేశాలు కొరియా ద్వీపకల్పంలో తీవ్ర సంచలనంగా మారాయి!