Begin typing your search above and press return to search.

ఆర్మీ విషయంలో కిమ్ ఆసక్తికర కోరిక ఇదే!

అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలు తయారు చేయాలని.. అమెరికాను అడ్డుకొనేందుకు ఈ వ్యూహాన్ని అనుసరించాలని కిమ్ ఇటీవల తన అధికారులకు సూచించినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   26 Feb 2025 10:30 PM GMT
ఆర్మీ విషయంలో కిమ్ ఆసక్తికర కోరిక ఇదే!
X

అమెరికాలో ట్రంప్ ప్రెసిడెంట్ గా ఎన్నికైనప్పటి నుంచీ ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మరింత దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలు తయారు చేయాలని తన అధికారులను ఆదేశించిన ఆయన.. తాజాగా ఎలాంటి యుద్ధాన్ని అయినా ఎదుర్కొనేలా బలమైన, సరికొత్త ఆధునిక ఆర్మీని నిర్మించాలని అన్నారు.

అవును... అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలు తయారు చేయాలని.. అమెరికాను అడ్డుకొనేందుకు ఈ వ్యూహాన్ని అనుసరించాలని కిమ్ ఇటీవల తన అధికారులకు సూచించినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మిలటరీ అకాడమీలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఇందులో భాగంగా... ఎలాంటి యుద్ధాన్నైనా ఎదుర్కోవడానికి బలమైన, ఆధునిక సైన్యాన్ని నిర్మించాలని కిమ్ సూచించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఉక్రెయిన్ పై యుద్ధానికి మద్దతుగా ఉత్తర కొరియా వేలాది మంది సైనికులను రష్యాకు పంపిన తర్వాత కిమ్ కాంగ్ కోన్ మిలటరీ అకాడమీలో పర్యటించారు.

ఈ సందర్భంగా... కిమ్ ఇల్ సుంగ్ యూనివర్శిటీ ఆఫ్ పాలిటిక్స్ ను కూడా సందర్శించి సైనిక విధేయత, త్యాగానికి పిలుపునిచ్చారు. ఇదే సమయంలో.. రష్యాకు అదనపు సైనికులను పంపించే సన్నాహాలలో భాగంగా... కిమ్ గతంలో సైనిక విభాగాల తనిఖీలు, శిక్షణని నిర్వహించవచ్చని దక్షిణ కొరియా నిఘా సంస్థ తెలిపింది.

ఈ సందర్భంగా మిలటరీ అకాడమీలోని వారు ఆధునిక యుద్ధానికి సంబంధించిన వాస్తవ అనుభవాల గురించి తెలుసుకోవాలని.. అధునాతన ఆయుధాలు, సాంకేతిక పరికరాలలో నైపుణ్యం సాధించడంపై దృష్టి సారించేలా విద్యను తీవ్రతరం చేయాలని ఆయన దిశానిర్ధేశం చేశారు. ఐడియాలజీ లేని ఆయుధాలు ఇనుపరాడ్లతో సమానం అని కిమ్ వ్యాఖ్యానించారు.

యుద్ధం, రక్తపాతం సర్వసాధారణంగా మారిన ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితికి తగినట్లుగా... సాయుధ దళాలు సిద్ధమవ్వాలని, యుద్ధాన్ని సంపూర్ణంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని తెల్లిపారు. మరోపక్క రష్యాలోని ఉత్తర కొరియా దళాలు భారీ ప్రాణనష్టాన్ని చూశాయని అంటున్నారు. సుమారు 3000 ఉ.కొ. సైనికులు మరణించినట్లు చెబుతున్నారు.