Begin typing your search above and press return to search.

కిమ్‌ రాజ్యంలో రెడ్‌ లిప్‌ స్టిక్‌ పై నిషేధం.. కారణం ఇదే!?

దీనికి సంబంధించిన కారణం ఆశ్చర్యకరంగా ఉందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   14 May 2024 4:30 AM GMT
కిమ్‌  రాజ్యంలో రెడ్‌  లిప్‌  స్టిక్‌  పై నిషేధం.. కారణం ఇదే!?
X

సౌందర్య ఉత్పత్తుల దగ్గర నుంచి దుస్తులు, చివరకు హెయిర్‌ స్టైల్‌ పై కూడా ఆంక్షలు అమలు చేస్తున్న దేశం ఏది అని అంటే... ఠక్కున చెప్పే పేరు ఉత్తర కొరియా అని! అక్కడ కిమ్.. తన రాజ్యంలో అమలు చేస్తున్న నిబంధనలు, అవి మీరితే విధిస్తున్న శిక్షల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అక్కడ కిమ్ మాటే శాసనం! ఈ నేపథ్యంలో తాజాగా రెడ్ లిప్ స్టిక్ పై కూడా ఉత్తర కొరియాలో నిషేధం విధించబడింది.

అవును... ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ పేరు చెప్పగానే ఆ దేశంలో ప్రజలు పడుతున్న కష్టాలు.. అందుకు కారణమైన అతడు అమలులోకి తెచ్చిన కఠిన చట్టాలు గుర్తుకువస్తాయనేది తెలిసిన విషయమే. ఆ దేశంలోని ప్రతీ మనిషీ.. ఎలా బ్రతకలి, ఏమి చూడాలి, ఏమి తినాలి, ఎలాంటి దుస్తులు ధరించాలి... అన్నీ కిమ్ ఇష్టప్రకారమే జరగాల్సిన పరిస్థితి! ఈ క్రమంలోనే తాజాగా మహిళలు రెడ్‌ లిప్‌ స్టిక్‌ వాడొద్దనే మరో నిబంధనను తీసుకొచ్చారు.

దీనికి సంబంధించిన కారణం ఆశ్చర్యకరంగా ఉందని అంటున్నారు. తాజాగా నిషేధం విధించబడిన రెడ్‌ లిప్‌ స్టిక్‌ ను ఉత్తర కొరియా అధినాయకత్వం పెట్టుబడిదారీ విధానానికి సంకేతంగా భావిస్తోందట. ఇది కమ్యూనిజానికి పూర్తి వ్యతిరేకమని వారి బలమైన నమ్మకం! దీంతో... రెడ్ లిప్ స్టిక్ పై కిమ్.. సెకండ్ థాట్ లేకుండా నిషేధం విధించారని చెబుతున్నారు. ప్రభుత్వం విధించిన ఈ ఆంక్షలను ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు విధిస్తారు. ఒక్కోసారి భారీ జరిమానా కట్టాల్సి వస్తుంది.

కాగా... ఉత్తరకొరియాలో ఇప్పటికే మేకప్ పై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో... జీన్స్‌ ధరించి రోడ్డుపై కనిపిస్తే.. అక్కడే ఆపి మరోసారి వేసుకోవడానికి వీల్లేకుండా వాటిని కత్తిరిస్తారు. కిమ్ చెప్పినట్లుగా జుట్టు లేకపోయినా పరిస్థితి అంతే... స్పాట్ కటింగే! మేకప్, జీన్స్, మోడ్రన్ హెయిర్ స్టైల్స్, ఇప్పుడు లిప్ స్టిక్... వీటన్నింటినీ అక్కడి ప్రభుత్వం పాశ్చాత్య సంస్కృతిగా భావిస్తుంది.

దీంతో.. ఇలా పాశ్చాత్య సంస్కృతికి అనుమతిస్తే ప్రజలు క్రమంగా ఆయా దేశాల భావజాలానికి ఆకర్షితులవుతారనేది కిమ్‌ భయం అని చెబుతుంటారు. ఆ భయం స్థానంలో... ప్రజలు నిరాడంబరంగా, సహజంగా ఉండాలని కిమ్‌ ప్రభుత్వం ప్రచారం చేస్తుంటుంది.