కాబోయే మంత్రి కిమిడి వారేనా ?
అంతే కాదు ఈ రోజుకీ జిల్లాలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హవాయే సాగుతోంది అంటున్నారు.
By: Tupaki Desk | 28 Dec 2024 3:49 AM GMTవిజయనగరం జిల్లాలో ప్రస్తుతం మంత్రిగా ఉన్న కొండపల్లి శ్రీనివాస్ అమాత్య పదవిని సరిగ్గా నిభాయించలేక తడబడుతున్నారు అని అంటున్నారు ఆయనకు రాజకీయంగా అనుభవం తక్కువగా ఉండడంతో పాటు కొత్త వారు కావడంతోనే ఇదంతా జరుగుతోంది అంటున్నారు.
అంతే కాదు ఈ రోజుకీ జిల్లాలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ హవాయే సాగుతోంది అంటున్నారు. మంత్రి కొండపల్లి బొత్సకు ఒకనాటి రోజులలో శిష్యుడిగా ఉన్నారు అని కూడా చెబుతూ ఉన్నారు ఆయన వైసీపీలో చాలా కాలం పనిచేశారు. దాంతో ఆయనకు అది కూడా ఇబ్బందిగా మారుతోంది.
ఈ పరిణామాలు అన్నీ కూడా చూస్తే కనుక కూటమిలో చేయబోయే మంత్రివర్గ మార్పు చేర్పులలో కొండపల్లి సీటుకు ఎసరు రాబోతోంది అని గట్టిగా వినిపిస్తోంది. అదే కనుక జరిగితే విజయనగరం జిల్లాకు మంత్రి పదవి లేకుండా పోతుంది.
అసలే వైసీపీ ప్రాబల్యం బాగా ఉన్న జిల్లా కావడంతో కొండపల్లిని మార్చినా వేరే వారిని ఆ చాన్స్ ఇస్తారని మరో వైపు ప్రచారం సాగుతోంది. ఆ విధంగా అనుకోని వరంగా ఆరు నెలల వ్యవధిలోనే మంత్రి పదవి సీనియర్ నేత మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావుని వరించి వస్తుందా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.
ఆయన అనుచరులు అభిమానులు అయితే ఈసారికి కిమిడి వారు మంత్రి అయినట్లే అని అంటున్నారు. ఆయనకు తొలి విడతలోనే చాన్స్ దక్కాలని అయితే రాజకీయ సమీకరణల వల్ల అవకాశం తప్పిందని ఇపుడు కచ్చితంగా దక్కుతుందని లెక్కలేసి మరీ చెబుతున్నారు.
తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన కొండపల్లి శ్రీనివాస్ ని కనుక ప్రస్తుత ప్రచారం ప్రకారం నిజమై తప్పించినట్లు అయితే అదే సామాజిక వర్గానికి చెందిన కిమిడి కళా వెంకటరావుకే ఆ అవకాశం దక్కుతుందని అంటున్నారు.
విజయనగరం జిల్లాలో చూస్తే తూర్పు కాపు ఎమ్మెల్యేలు ఈ ఇద్దరే ఉన్నారని అంటున్నారు. ఇక చంద్రబాబుతో పాటు లోకేష్ కి కూడా అత్యంత సన్నిహితుడుగా ఉన్న కళా వెంకటరావు రాజకీయంగా సీనియర్ కావడంతో ఆయన ద్వారా జిల్లా రాజకీయాలను కూటమిని అనుకూలంగా మార్చుకోగలుగుతారు అన్న చర్చ కూడా సాగుతోంది.
మొత్తం మీద చూసుకుంటే కనుక గజపతినగరం నుంచి చీపురుపల్లికి మంత్రి పదవి షిఫ్ట్ అవుతుందన్న ప్రచారం అయితే జోరందుకుంది. ఇక కిమిడి కళా వెంకటరావు రాజకీయంగా ఇదే చివరి చాన్స్ అని భావిస్తున్నారు. ఆయన పార్టీ పట్ల విధేయతతో ఉన్నారు. పార్టీ ఆదేశానుసారం ఎచ్చెర్ల నుంచి వచ్చి చీపురుపల్లిలో ఆఖరి నిముషంలో పోటీ చేసి అప్పటి మంత్రి అయిన బొత్స సత్యనారాయణ మీద భారీ మెజారిటీతో గెలిచారు. దాంతో కిమిడికి మంత్రి యోగం పట్టనుంది అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.