Begin typing your search above and press return to search.

ఆ నియంత కంటే ఆయన చెల్లెలే యమ డేంజర్‌!

ఉత్తర కొరియా నియంత.. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. నియంత అనే పదానికి అసలు సిసలైన నిర్వచనం.. ఆయన

By:  Tupaki Desk   |   10 Oct 2023 10:32 AM GMT
ఆ నియంత కంటే ఆయన చెల్లెలే యమ డేంజర్‌!
X

ఉత్తర కొరియా నియంత.. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ గురించి తెలియనివారు లేరంటే అతిశయోక్తి కాదు. నియంత అనే పదానికి అసలు సిసలైన నిర్వచనం.. ఆయన. తరచూ అణు పరీక్షలు, క్షిపణి పరీక్షలు నిర్వహిస్తూ జపాన్, దక్షిణ కొరియా, అమెరికా దేశాలను ఉన్‌ కవ్విస్తూ ఉంటాడు.

అయితే కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కంటే ఆయన సోదరి కిమ్‌ యో జోంగ్‌ ఇంకా క్రూరురాలని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇటీవల మార్కెట్లోకి విడుదలయిన 'ది సిస్టర్‌' అనే పుస్తకం వెల్లడించింది. ఈ పుస్తకంలో ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరి కిమ్‌ యో జోంగ్‌ ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మహిళగా ఎలా మారిందో సవివరంగా రాశారు.

కిమ్‌ యో జోంగ్‌ తన సోదరుడు, ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కంటే అత్యంత క్రూరమైన మహిళ అని, ఆమెను చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన మహిళ అని పిలవడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదని పుస్తకంలో పేర్కొన్నారు.

ఈ మేరకు ఉత్తర కొరియా మూలాలు కలిగి, అమెరికాలో ఉంటున్న రచయిత్రి సంగ్‌ యూన్‌ లీ.. 'ది సిస్టర్‌' పేరుతో ఓ పుస్తకం రాశారు. అందులో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మహిళగా కిమ్‌ యో జోంగ్‌ ఎలా మారిందో వివరించారు. 'ది సిస్టర్‌' అనే ఈ పుస్తకానికి 'నార్త్‌ కొరియా కిమ్‌ యో జోంగ్, ది మోస్ట్‌ డేంజరస్‌ ఉమెన్‌' అని ట్యాగ్‌ లైన్‌ కూడా ఉండటం గమనార్హం.

ఉత్తర కొరియాలోని 25 మిలియన్ల మంది పౌరులు కిమ్‌ కుటుంబాన్ని ఆరాధిస్తుంటారని, వారు సాగించే అవినీతి గురించి ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తారని పుస్తకంలో పేర్కొన్నారు.

కాగా ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ సోదరికి సంబంధించిన మొదటి ఫొటో 1990వ దశకం ప్రారంభంలో ఆ దేశం ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించే సమయంలో బయటకు వచ్చింది. అప్పుడు ఆమె వయసు 10 ఏళ్లు.

ప్రస్తుతం ఉత్తర కొరియా పాలకుడు కిమ్‌ జోంగ్‌ ఆరోగ్యం క్షీణించడంతో తన తర్వాత పాలనా పగ్గాలను సోదరి కిమ్‌ యో జోంగ్‌ కు అప్పగించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కు ఆమె ఏకైక చెల్లెలు కావడం గమనార్హం. కిమ్‌ యో జోంగ్‌ ఇప్పటికే తన సోదరుడితోపాటు ఉత్తర కొరియా పాలనలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. తరచూ తన సోదరుడి పక్కనే ఉంటారు. ఇటీవల కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రష్యాలో పర్యటించిన సందర్భంగా ఆయనతోపాటు కిమ్‌ యో జోంగ్‌ కూడా వెళ్లారు. అక్కడ రష్యాతో ఒప్పందం కుదుర్చుకోవడంలో తన వంతు పాత్ర పోషించారు.

పుస్తకం రచయిత.. సంగ్‌ యూన్‌ లీ తన పుస్తకంలో తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తర కొరియా పాలకుని సింహాసనం ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు వెంటనే కిమ్‌ యో జోంగ్‌ ఈ పదవిని చేపట్టే అవకాశాలున్నాయి. అంతేకాకుండా తన సోదరుడిలానే ఆమె కూడా నిరంకుశంగా వ్యవహరిస్తారని సంగ్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు.

గత కొన్నేళ్లుగా ఆమె తన సోదరుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ కు అడుగడుగునా అండగా నిలిచారని పుస్తకంలో రాశారు. ఆమెకు తన సోదరుని ప్రతి రహస్యం తెలుసని, అతడి మామ హత్యలోనూ తన సోదరునికే అండగా నిలిచారని వెల్లడించారు.

కాగా 2020లోనే కిమ్‌ జోంగ్‌ ఉన్‌ తన సోదరికి కీలక బాధ్యతలు అప్పగించారని పుస్తకంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కిమ్‌ యో జోంగ్‌ దేశంలోని అన్ని వ్యవహారాలను చూసుకుంటుంటున్నారని ఆ పుస్తకం తెలియజేసింది. దక్షిణ కొరియాలోని గాంగ్‌ నెంగ్‌ లో జరిగిన 2018 వింటర్‌ ఒలింపిక్స్‌లో కిమ్‌ యో జోంగ్‌ మహిళల ఐస్‌ హాకీ గేమ్‌ లో బరిలోకి దిగడం గమనార్హం.

దక్షిణ కొరియాలో కిమ్‌ యో జోంగ్‌ స్నేహపూర్వక, మర్యాదపూర్వక ప్రవర్తనను చూపినప్పుడు ప్రజలు ఆమెను చూసి కిమ్‌ జోంగ్‌ ఉన్‌ లాంటివారు కాదని భావించారు. ఈ నేపథ్యంలో ఆమెను అందరూ రాజకుమారి అని కొనియాడారు.

అయితే ఎప్పుడయితే ఉత్తర కొరియాలో అధికార బాధ్యతల్లో కీలక పాత్ర పోషించడం మొదలుపెట్టారో ఇక అప్పటి నుంచి కిమ్‌ యో జోంగ్‌ లోనూ తన సోదరుడి మాదిరిగానే అధికార కాంక్ష, నియంతృత్వం పెల్లుబికాయని అంటున్నారు. ఆమె తల్లిదండ్రులు కిమ్‌ జోన్‌ ఉన్‌ తోపాటు ఆమెను కూడా మొదటి నుంచి నిబంధనలకు అతీతంగా పెంచారని 'ది సిస్టర్‌' పుస్తకంలో పేర్కొన్నారు. తన సోదరునిలాగే ఆమె స్విస్‌ బోర్డింగ్‌ స్కూల్‌ లో కొన్నేళ్లు విద్యనభ్యసించారు. అంతేకాకుండా ఆమెకు కంప్యూటర్‌ పై మంచి పరిజ్ఞానం ఉందని తెలుస్తోంది.

కిమ్‌ నుంచి ఆమెకు క్రూరత్వం వారసత్వంగా వచ్చిందని పుస్తకంలో రాశారు. ఆమెను దేశంలోని కొందరు 'దెయ్యం మహిళ', 'అహంకార యువరాణి','సహ నియంత' అని పిలుస్తుండటం గమనార్హం.