Begin typing your search above and press return to search.

నడిరోడ్డు మీద తోట చంద్రయ్య గొంతు కోసి చంపారే.. అప్పుడేమైందంటూ అచ్చెన్న ఆగ్రహం!

ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగిపోతున్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో రక్తపుటేరులు పారించిన వైనాన్నిప్రజలు మర్చిపోలేదన్నారు

By:  Tupaki Desk   |   5 Aug 2024 5:21 AM GMT
నడిరోడ్డు మీద తోట చంద్రయ్య గొంతు కోసి చంపారే.. అప్పుడేమైందంటూ అచ్చెన్న ఆగ్రహం!
X

కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత రాష్ట్రం అరాచక ఆంధ్రప్రదేశ్ గా మారిందంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యపై స్పందించారు ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు. ప్రజలు ఓడించిన తర్వాత కూడా తన తీరులో మార్పు రాలేదంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో ఏదో జరిగిపోతున్నట్లుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. గడిచిన ఐదేళ్లలో రాష్ట్రంలో రక్తపుటేరులు పారించిన వైనాన్నిప్రజలు మర్చిపోలేదన్నారు.

ప్రజలు మొదలుకొని ప్రతిపక్ష నేతల వరకు ప్రతిరోజూ దాడులు జరిగాయన్న విషయాన్ని గుర్తు చేసిన అచ్చెన్న.. ‘‘పల్నాడులో తెలుగుదేశం పార్టీ కార్యకర్త తోట చంద్రయ్యను నడిరోడ్డు మీద గొంతు కోసి చంపింది ఎవరు? అంత దారుణ సంఘటన జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి ఏం చేశారు? కళ్లు మూసుకొని కూర్చున్నారా?’’ అంటూ నిప్పులు చెరిగారు.

ఏపీలో పరిస్థితులన్నీ బాగానే ఉన్నా.. బాగోలేదని ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ‘‘అధికారం చేజారిన తర్వాత ప్రతిపక్ష ఎమ్మెల్యే మానసిక పరిస్థితి బాగోలేదు. అధికారం పోయేసరికి ఏం చేయాలో అర్థంకాక కూటమి ప్రభుత్వంపై అబద్ధాలతో కుట్రలు పన్నుతున్నారు’’ అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.

ప్రజల అకాంక్షలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం నడుచుకుంటుందని.. దాన్ని ఓర్వలేకనే తప్పుడు ప్రచారాల్ని చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని.. లేకుంటే వచ్చే ఎన్నికల్లో గెలవటమే ఉందన్నారు. ప్రజలు పదకొండు స్థానాలకు పరిమితం చేసినా విపక్ష అధినేతలో మార్పు రాలేదన్న అచ్చెన్న.. ‘‘జగన్ తప్పుడు ప్రచారాన్ని జనం నమ్మే పరిస్థితుల్లో లేరు. త్వరలోనే వైసీపీ కార్యాలయానికి టులెట్ బోర్డు పెట్టుకోవటం ఖాయం’’ అని వ్యాఖ్యానించారు.