Begin typing your search above and press return to search.

పెన్షనర్లకు టెన్షన్... అచ్చెన్న బాంబు పేల్చారా ?

టీడీపీ కూటమిలో కీలకమైన మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు సామాజిక పెన్షన్ల మీద బాంబు పేల్చారు

By:  Tupaki Desk   |   2 Aug 2024 3:55 AM GMT
పెన్షనర్లకు టెన్షన్... అచ్చెన్న బాంబు పేల్చారా ?
X

టీడీపీ కూటమిలో కీలకమైన మంత్రిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు సామాజిక పెన్షన్ల మీద బాంబు పేల్చారు. పెన్షన్లలో భోగస్ పెన్షన్లు ఏరివేస్తామని ఆయన కీలక ప్రకటన చేశారు. ఒక వైపు ఆగస్టు మొదటి రోజునే సామాజిక పెన్షన్లను ఉత్సాహంగా పంచుతూ టీడీపీ మంత్రులు ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులూ లబ్దిదారులకు ఆనందం కలిగించారు.

అలాగే అచ్చెన్నాయుడు కూడా పెన్షన్లను పంచుతూ వారితో కలసి ముచ్చటిస్తూ సందడి చేశారు. అయితే మీడియా ముందుకు రాగానే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పెన్షన్లలో భోగస్ ఉన్నాయని స్టేట్మెంట్ ఇచ్చారు. వాటిని తొలగిస్తామని ఆయన చేసిన ఈ ప్రకటన లబ్దిదారులకు వణుకు పుట్టిస్తోంది. సాధ్యమైనంత త్వరలోనే సామాజిక పెన్షన్లలో అనర్హులను ఏరివేసే ప్రక్రియను ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఏపీలో 66 లక్షలకు పైగా సామాజిక పెన్షన్ల లబ్దిదారులు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక జూలై నెలలో 65 లక్షల 18 వేల 496 మందికి పెన్షన్లు పంపిణీ చేసినట్లుగా చెబుతున్నారు. ఇక ఆగస్టు నెలలో చూస్తే 64 లక్షల 39 వేల 41గా పెన్షన్లు ఉన్నాయని అంటున్నారు.

ఇప్పటికే పెన్షన్లలో కోత పెట్టారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే వైసీపీ హయాంలో చాలా మంది అనర్హులకు పెన్షన్లు ఇచ్చేశారని దాని ఫలితంగానే నంబర్ దారుణంగా పెరిగిందని కూడా అంటున్నారు. చాలా మంది వివిధ కేటగిరీలలో పెన్షన్లు పుచ్చుకుంటున్నారు అని కూడా అంటున్నారు.

ఈ లెక్కను సరిచేయాల్సిందే అని కూటమి పెద్దలు అంటున్నారు. ఇదే క్రమంలో అర్హులకు పెన్షన్లు కట్ చేస్తేనే ఇబ్బది వస్తుందని కూడా లబ్దిదారుల నుంచి విన్నపం వస్తోంది. అర్హులకు పెన్షన్ ఇచ్చి తీరాలని కొత్త నిబంధలను పెట్టినా లేక గతంలో తెచ్చినట్లుగా జన్మభూమి కమిటీలతో అర్హతను తేల్చాలని చూసినా ఇబ్బందులు వస్తాయని అంటున్నారు.

సామాజిక పెన్షన్లలో అవకతవకలు ఉంటే తప్పకుండా తీయాల్సిందే అని అంటున్నారు. ఏపీ ఆర్థికంగా ఇబ్బందులో ఉంది. దాంతో పెద్ద ఎత్తున పెన్షన్లు మంజూరు చేస్తున్న నేపధ్యంలో అపాత్రదానం అన్నది ఉండరాదని అంటున్నారు. మొత్తం మీద అచ్చెన్నాయుడు ఇచ్చినట్లుగా చెబుతున్న ప్రకటన మాత్రం కలవరం రేపుతోంది.

సామాజిక పెన్షన్ల విధివిధానాలను సవరిస్తారా అన్న కొత్త చర్చ కూడా మొదలైంది. ఏది ఏమైనా రెండే పద్ధతులు ఉన్నాయి. పెన్షన్లు భారం అవుతున్నాయి. అది ఆర్ధికంగా గుదిబండగా మారుతోంది. దాంతో భోగస్ పేరిట కత్తిరింపులు వేయకుండా నిజంగా అనర్హులు ఉంటే తొలగిస్తే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది లబ్దిదారులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు.