వావ్ రామ్మోహన్: నిండు సభలో సవాల్ చేసి మరీ కేంద్ర మంత్రి
తాను మాట్లాడుతుంటే.. పార్టీకి ఉన్న సభ్యుల ఆధారంగా ఇచ్చే సమయం తక్కువగా ఉందంటూ.. ఆయన మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు.
By: Tupaki Desk | 10 Jun 2024 5:35 AM GMTవయసు.. అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ పార్టీ పట్ల కమిట్ మెంట్ ఉండాలే కానీ తెలుగుదేశం పార్టీలో కీలక పదవులు సొంతం చేసుకోవచ్చన్న విషయం మరోసారి నిరూపితమైంది. తాజాగా శ్రీకాకుళం ఎంపీగా ఘన విజయాన్ని సాధించిన టీడీపీ యువనేత రామ్మోహన్ నాయుడు తొలిసారి కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పుడు కేంద్ర మంత్రి కానీ గత ప్రభుత్వంలో విపక్షంలో ఉన్న ఆయన.. సభలో సీరియస్ అంశంపై మాట్లాడేందుకు సైతం సమయం లభించని పరిస్థితి. తాను మాట్లాడుతుంటే.. పార్టీకి ఉన్న సభ్యుల ఆధారంగా ఇచ్చే సమయం తక్కువగా ఉందంటూ.. ఆయన మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదు.
అలాంటివేళలో అసహనం వ్యక్తం చేసిన ఆయన.. ఇంకాస్త సమయం ఇవ్వాలని కోరారు. అందుకు నో చెప్పటంతో ఆయన నోటి నుంచి కీలక ప్రతిన వచ్చింది. వచ్చే పార్లమెంట్ కు తమ పార్టీ ఎక్కువ మెజార్టీ వస్తుందని.. అప్పుడు సమయం గురించి తమకు ఎలాంటి ఇబ్బంది ఉండదంటూ గట్టిగా మాట్లాడటమే కాదు.. తాజాగా కేంద్ర మంత్రిగా ప్రమాణష్వీకారం చేశారు. మొత్తం 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేస్తే.. అందులో రామ్మోహన్ నాయుడు స్థానం పదహారు. అంటే.. మొదటి 20 మందిలో ఒకరుగా ఆయన నిలిచారు.
మరో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. మోడీ మంత్రివర్గంలో అత్యంత పిన్నవయస్కుడిగా రామ్మోహన్ నాయుడు రికార్డు క్రియేట్ చేశారు. 36 ఏళ్ల పిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన.. రానున్న రోజుల్లో మరిన్ని పదవులు చేపట్టటం ఖాయమని చెప్పాలి. రామ్మోహన్ నాయుడు బ్యాక్ గ్రౌండ్ విషయానికి వస్తే ఆయన తండ్రి దివంగత ఎర్రన్నాయుడు 2012 నవంబరు 2న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటం తెలిసిందే. అనంతరం ఆయన రాజకీయ వారసుడిగా రంగప్రవేశం చేసిన ఆయన 2014లో శ్రీకాకుళం ఎంపీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.
ముచ్చటగా మూడోసారి ఎంపీగా పోటీ చేసి 3.27 లక్షల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందిన ఆయనకు తొలిసారి కేంద్ర మంత్రి పదవిని సొంతం చేసుకున్నారు. విషయాల మీద అవగాహనతో పాటు.. ఇంగ్లిషు.. హిందీలలో బాగా మాట్లాడే సత్తా ఉన్న రామ్మోహన్ నాయుడు తాజా సభలో తన సత్తా చాటతారని చెబుతున్నారు.