Begin typing your search above and press return to search.

పోటీ చేయనంటూ కిరణ్ కోరుకుంటున్న పదవేంటి ?

ఇదిలా ఉంటే కిరణ్ రాజకీయంగా రిటైర్ అయితే కాలేదు. ఆయన బీజేపీ అధినాయకత్వం పెద్దలతో టచ్ లో ఉన్నారు.

By:  Tupaki Desk   |   13 Jan 2025 4:40 AM GMT
పోటీ చేయనంటూ కిరణ్ కోరుకుంటున్న పదవేంటి ?
X

ఎన్నికల్లో పోటీ చేయాలి. విజయం సాధించాలి. అపుడు అనుకున్న అందలం దక్కుతుంది. బీజేపీలో చేరి రాజంపేట లోక్ సభ సీటు నుంచి 2024 ఎన్నికల్లో పోటీ చేసి ఓడారు ఉమ్మడి ఏపీ చివరి సీఎం బీజేపీ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఒక వైపు ఏపీలో టీడీపీ కూటమి వేవ్ ఉధృతంగా వీచింది.

అద్భుతమైన విధంగా విజయాలు ఆ పార్టీకి దక్కాయి. మెజారిటీలు చూస్తే అదిరిపోయాయి. అనూహ్యంగా రాయలసీమలో సైతం కూటమి జెండాలు పాతేశారు. చాలా మంది బీజేపీ నేతలు జనసేన నేతలు ఎమ్మెల్యేలు అయిపోయారు. అలాంటిది సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు అనుచర గణం ఉన్నా కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలు కావడమేంటి అన్న చర్చ అయితే ఉంది.

దానికి కిరణ్ కుమార్ రెడ్డి జవాబు ఏంటి అంటే తన లాంటి వారు ప్రస్తుతం ఎన్నికల్లో పోటీకి సరిపోరు అని. ఎన్నికల్లో పోటీ చేయాలీ అంటే చాలా చేయాలని ఆయన అంటున్నారు. డబ్బులను దోచుకున్న వాళ్ళలో కొందరు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని ప్రజలు కూడా వారికే ఓటు వేస్తున్నారు అని కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. దాంతో ఎన్నికలు అంటేనే భయమేస్తోంది అని ఆయన అన్నారు. తాను రానున్న ఎన్నికల్లో పోటీ చేసేది ఉండదని ఆయన అంటున్నారు.

ఇదిలా ఉంటే కిరణ్ రాజకీయంగా రిటైర్ అయితే కాలేదు. ఆయన బీజేపీ అధినాయకత్వం పెద్దలతో టచ్ లో ఉన్నారు. ఆయన అ మధ్యన రాజ్యసభ సీటు కోసం ప్రయత్నం చేశారు అని ప్రచారం సాగింది. ఆ విధంగా ఆయన కేంద్ర మంత్రి కావాలని భావిస్తున్నారు అని కూడా అంతా అనుకున్నారు.

ఇపుడు చూస్తే ఎక్కడా రాజ్యసభ సీట్ల ఖాళీలు లేవు. అయితే ఇపుడు గవర్నర్ పోస్టు మీద కిరణ్ ఆశలు పెంచుకుంటున్నారా అన్న చర్చ సాగుతోంది. గవర్నర్ పోస్టుకు అయితే ఆయన హుందాగా రాజ్ భవన్ నుంచి పదవిని నిర్వహించగలరు అన్న వారూ ఉన్నారు.

ఉమ్మడి ఏపీ వంటి పెద్ద స్టేట్ కి ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయను అంటూనే కేలక పదవులు ఆశిస్తున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది. మరి బీజేపీలో చురుకుగా ఆయన పాల్గొనడం లేదని విమర్శలు ఉన్నాయి. కేంద్ర బీజేపీ కిరణ్ కి సముచితమైన స్థానం ఇస్తుందా ఆయన కోరుకుంటున్న రాజ్యసభ సీటు కానీ గవర్నర్ పదవి వంటివి కానీ ఇస్తారా అన్నది చర్చగా ఉంది. చూడాలి మరి ఈ విషయంలో ఏది నిజమవుతుందో.