Begin typing your search above and press return to search.

కప్పు కాఫీ ఇవ్వకుండా సీఎం పోస్టు ఆయనదే !

అయితే అవన్నీ తప్పుడు ప్రచారాలు అని ఇన్నేళ్ల తరువాత కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఇపుడు బీజేపీలో సీనియర్ నేతగా ఉన్నారు.

By:  Tupaki Desk   |   6 Jan 2025 9:30 PM GMT
కప్పు కాఫీ ఇవ్వకుండా సీఎం పోస్టు ఆయనదే !
X

ఈ రోజులలో ఏదైనా పైరవీ చేయాల్సిందే అన్న కాన్సెప్ట్ జనం మదిలో ఉంది. ఏ చిన్న పని అయినా పదవి అయినా కూడా పైరవీలు ఉండి తీరాల్సిందే అనుకుంటారు సాదర జనం. లాబీయింగ్ చేయకుండా ఏదీ జరగదు అని నమ్ముతారు. అలాంటిది ఏకంగా ఉమ్మడి ఏపీలోని 23 జిల్లాలకు ముఖ్యమంత్రి పదవి అంటే అది సామాన్యమైన విషయమా. పైగా మొత్తం దక్షిణాదిన అతి పెద్ద స్టేట్ గా ఉమ్మడి ఏపీ నాడు ఉండేది.

ఆ స్టేట్ కి సీఎం గా చేసిన వారు కూడా ఎంతో ఘనమైన వారు. వారి వారసులుగా రావాలని అనుకున్నపుడు ఎన్నో చూస్తారు. ఎంతగానో ఆలోచిస్తారు. మరి 2010 నవంబర్ లో చూస్తే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయిపోయారు. ఆయన మంత్రి పదవి కూడా నిర్వహించలేదు. అయితే ఆయన అప్పటికి స్పీకర్ గా ఉన్నారు. చీఫ్ విప్ గా పనిచేశారు.

ఆయన కంటే ముందు సీఎం గా ఉన్న రోశయ్యను గవర్నర్ గా పంపించి కిరణ్ కుమార్ రెడ్డిని సీఎం గా చేసినపుడు అంతా విస్మయం చెందారు. ఒక విధంగా కిరణ్ కుమార్ రెడ్డి జాక్ పాట్ సీఎం అన్నారు. ఆయన తెర వెనకేదో చేశారు అని కూడా అనుకున్నారు.

అయితే అవన్నీ తప్పుడు ప్రచారాలు అని ఇన్నేళ్ల తరువాత కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆయన ఇపుడు బీజేపీలో సీనియర్ నేతగా ఉన్నారు. ఆ హోదాలో ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్నపుడు తన మనసులో భావాలను మీడియా ముందు పెట్టారు. తాను సీఎం పోస్టు కోసం ఒక కప్పు టీ కూడా ఎవరికీ ఇవ్వలేదని ఉన్నది ఉన్నట్లుగా ఫుల్ క్లారిటీతో చెప్పేశారు.

తాను ఏపీ ప్రజలకు మేలు చేయాలని చూశాను అని అన్నారు. తనకు అరుదైన అవకాశం దక్కితే ప్రజల కోసం ఈ విధంగా మంచిగా పనిచేయాలని తపన పడ్డాను అన్నారు. ఆ మీదట కాంగ్రెస్ అధినాయకత్వం తన పేరుని ప్రకటించిందని అన్నారు. అలా మూడేళ్ల పాటు కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఏపీకి చివరి సీఎం గా పనిచేసిన రికార్డుని సొంతం చేసుకున్నారు.

ఇదిలా ఉంటే తనకు పిలిచి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన అదే కాంగ్రెస్ పార్టీకి సీఎం పదవికి చివర్లో రాజీనామా చేయాలనుకోవడం వెనక కూడా ప్రజా శ్రేయస్సు ఉందని అన్నారు. కాంగ్రెస్ హైకమాండ్ తన రాజీనామా నిర్ణయాన్ని పట్టించుకోకపోవడంతో మీడియా ముందుకు రావాల్సి వచ్చిందని అన్నారు.

ఇక తాను బీజేపీలో చేరడం కొంత ఆలస్యం అయింది అని ఆయన అంటున్నారు. కొంత ముందుగా చేరి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది అని ఆయన అంటున్నారు. అంటే ఆయన రాజకీయ భవిష్యత్తు వేరేగా ఉండేది అన్న అర్ధంతో మాట్లాడారా అన్న చర్చ వస్తోంది.

ఏపీలో బీజేపీ బలపడేందుకు ఎంతగానో అవకాశాలు ఉన్నాయని కిరణ్ కుమార్ రెడ్డి అంటున్నారు. అంతే కాదు ఏపీ రాజకీయాల్లో బీజేపీ స్పష్టంగా ఉందని అన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ మీద సాఫ్ట్ కార్నర్ బీజేపీ లేదని ఆయన అన్నారు. ఆయన కేసులన్నీ న్యాయ స్థానాలలో ఉన్నాయి, ప్రజాస్వామ్యంలో ఉన్న కొన్ని లొసుగుల వల్లనే కేసుల వేగంలో జాప్యం అవుతోందని అన్నారు.

మరో వైపు చూస్తే ఏపీలో అప్పులు పెరిగిపోతున్నాయని కిరణ్ కుమార్ రెడ్డి అందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధిలో బాగా వెనకబాటుతనం కనిపిస్తోంది అని అన్నారు. ఏపీని వేగంగా అభివృద్ధి చేసుకోవాల్సి ఉందని అన్నారు. అంతే కాదు పోల్వరం ఏపీకి ఒక వరమని ఈ ప్రాజెక్ట్ ని తొందరగా పూర్తి చేసుకోవాలని ఆయన అన్నారు

ఒక్క పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే ఏపీలో ఏకంగా 23 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ సాధ్యపడుతుందని ఆయన గుర్తు చేశారు. అంతే కాదు మరో ఏడు లక్షల 20 వేల ఎకరాల కొత్త ఆయకట్టుకు సైతం సాగు నీరు లభిస్తుందని 900 మెగా వాట్ల జల విద్యుత్ ఉత్పాదనతో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందని అన్నారు

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో పొరుగు రాష్ట్రాలతో తొందరగా ఒప్పందాలు చేసుకోవాలని మాజీ సీఎం సూచించారు. అంతే కాదు గోదావరి కృష్ణా జలాల వినియోగం విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలసికట్టుగా పనిచేయాలని కోరారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ తెలంగాణాకు అన్యాయం జరుగుతోందని తాను సీఎం గా ఉన్నపుడు సుప్రీం కోర్టు నుంచి స్టే తీసుకుని వచ్చామని ఆ స్టే అలాగే ఉదని దాని మీద కూడా ఆలోచించాలని కోరారు.