Begin typing your search above and press return to search.

కిరణ్ రాయల్ కేసు మరో మలుపు.. ఆ సెక్షన్లు వేయలేదంటూ లక్ష్మిరెడ్డి ఆరోపణలు

తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. తిరుపతి ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్ లో లక్ష్మిరెడ్డి అనే మహిళ ఫిర్యాదుపై కిరణ్ రాయల్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే.

By:  Tupaki Desk   |   20 Feb 2025 11:32 AM GMT
కిరణ్ రాయల్ కేసు మరో మలుపు.. ఆ సెక్షన్లు వేయలేదంటూ లక్ష్మిరెడ్డి ఆరోపణలు
X

తిరుపతి జనసేన ఇంచార్జి కిరణ్ రాయల్ కేసు మలుపుల మీద మలుపులు తిరుగుతోంది. తిరుపతి ఎస్వీయూ క్యాంపస్ పోలీస్ స్టేషన్ లో లక్ష్మిరెడ్డి అనే మహిళ ఫిర్యాదుపై కిరణ్ రాయల్ పై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసు జారీ చేస్తే.. కోర్టు నుంచి కిరణ్ రాయల్ రక్షణ పొందారు. దీన్ని సవాల్ చేస్తూ బాధితురాలు లక్ష్మీరెడ్డి మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తానిచ్చిన ఫిర్యాదులో కొన్ని అంశాలను పక్కనపెట్టారని ఆమె ఆరోపిస్తూ తాజాగా మరో ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది.

తనను మోసం చేసిన కిరణ్ రాయల్ ను విడిిచిపెట్టనని లక్ష్మీరెడ్డి చెబుతున్నారు. కిరణ్ రాయల్ ను అరెస్టు చేసేంత వరకు తాను పోరాడతానని అంటున్నారు. తానిచ్చిన ఫిర్యాదుతో హైకోర్టుకు వెళ్లిన కిరణ్ రాయల్.. ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీం మార్గదర్శకాలను పాటించాలని ఉపశమనం పొందినట్లు లక్ష్మిరెడ్డి చెబుతున్నారు. అయితే తనను బెదిరించి చంపేస్తామన్న కిరణ్ రాయల్ హెచ్చరికలపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడం వల్లే కోర్టు నుంచి అలాంటి నిర్ణయం వెలువడిందని అమె అంటున్నారు. కేవలం బెదిరింపు కేసు నమోదు చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని లక్ష్మిరెడ్డి వివరిస్తున్నారు.

తనకు తన కుటుంబానికి ఇప్పటికీ కిరణ్ రాయల్ నుంచి ముప్పు ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేస్తూ తిరుపతి ఎస్పీకి మరో ఫిర్యాదు చేశారు. తనకు రోజూ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. కిరణ్ రాయల్ ను అరెస్టుచేస్తేనే తనకు న్యాయం జరుగుతుందని అన్నారు. తిరుపతి జనసేన ఇంచార్జిగా పనిచేసిన కిరణ్ రాయల్ రూ.1.20 కోట్లు నగదు, 25 సవర్ల బంగారం తీసుకుని తనను మోసం చేశాడని లక్ష్మిరెడ్డి గతంలో ఆరోపించారు. తనకు చావే శరణ్యమంటూ సెల్ఫీ వీడియో తీసుకుని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో కిరణ్ రాయల్ పై జనసేన పార్టీ చర్యలు తీసుకుంది. అయితే లక్ష్మిరెడ్డికి ఇవ్వాల్సిన నగదు ఎప్పుడో ఇచ్చేశానని కిరణ్ రాయల్ చెబుతున్నారు. కానీ, లక్ష్మీరెడ్డి మాత్రం కిరణ్ రాయల్ మాటలను ఖండిస్తూ పోలీసులకు వరుస ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. దీంతో ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.