Begin typing your search above and press return to search.

చంద్రబాబుతో మాజీ సీఎం కిరణ్ భేటీ...మ్యాటరేంటి ?

ఎందుకు కలిశారు, ఏ అంశాలు మాట్లాడుకున్నారు అన్నది అంతటా చర్చనీయాంశంగా ఉంది.

By:  Tupaki Desk   |   6 Oct 2024 10:30 PM GMT
చంద్రబాబుతో మాజీ సీఎం కిరణ్ భేటీ...మ్యాటరేంటి ?
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైదరాబాద్ లో మాజీ సీఎం బీజేపీ సీనియర్ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. ఈ ఇద్దరి భేటీ రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. ఎందుకు కలిశారు, ఏ అంశాలు మాట్లాడుకున్నారు అన్నది అంతటా చర్చనీయాంశంగా ఉంది.

ఇదిలా ఉంటే ఇద్దరూ చిత్తూరు జిల్లాకు చెందిన వారే. నల్లారి నారా కుటుంబాల మధ్య రాజకీయంగా దశాబ్దాల వైరం ఉంది. వైఎస్సార్ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ నుంచి చీఫ్ విప్ గా పనిచేశారు, అలాగే స్పీకర్ అయ్యారు. ఈ రెండు పదవులలో ఆయన అప్పటి ఉమ్మడి ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబుని ఎంతలా కట్టడి చేయాలో అంతలా చేశారు.

అయితే అవన్నీ వైఎస్సార్ జీవించి ఉన్నంతవరకే. వైఎస్సార్ మరణానంతరం అనేక రాజకీయ మార్పులు జరిగాయి. కిరణ్ కాంగ్రెస్ సీఎం అయ్యారు. అప్పట్లో వైసీపీని పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని జగన్ అస్థిరపరచే ప్రయత్నం చేస్తున్నారు అన్న ప్రచారం నేపథ్యంలో కిరణ్ కి అండగా అనేక సందర్భాలలో టీడీపీ చంద్రబాబు నిలబడ్డారు అని కూడా చెప్పుకున్నారు.

ఏకంగా కిరణ్ మీద వైసీపీ అవిశ్వాసం పెడితే టీడీపీ అండగా ఆయనకు నిలబడింది. అలా నల్లారి నారాల మధ్య సరికొత్త రాజకీయ బంధం ఏర్పడింది. అది నాటి నుంచి ఈ రోజుకీ కొనసాగుతూ వస్తోంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజంపేట నుంచి బీజేపీ తరఫున అభ్యర్ధిగా కిరణ్ కుమార్ రెడ్డి నిలబడ్డారు. కూటమి ప్రభంజనం బలంగా వీచినా ఆయన డెబ్బై వేల ఓట్ల తేడాతో ఓటమి పాలు అయ్యారు. అయితే ఉమ్మడి ఏపీకి చివరి సీఎం గా ఉన్న కిరణ్ సేవలను బీజేపీ ఉపయోగించుకోవాలని చూస్తోంది.

దాంతో ఆయనను తొందరలోనే ఏపీ బీజేపీ చీఫ్ గా నియమిస్తారు అని అంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన చంద్రబాబుని కలుసుకుని రాజకీయ అంశాలు చర్చించి ఉంటారని అంటున్నారు. చంద్రబాబు సోమవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో బాబు నివాసంలో ఆయనను కలిసిన నల్లారి వారు అనేక అంశాలు చర్చించారు అని ప్రచారం సాగుతోంది. ఇక బాబుని కలిసే ముందు ఆయన ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కలిశారు.

ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది. అలాగే కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ ఉంది. దాంతో మిత్రపక్షంగా నల్లారి కిరణ్ బాబుని కలసి ఏపీ రాజకీయ పరిణామాలను చర్చించి ఉంటారని అంటున్నారు. గత ఏణ్ణర్ధంగా ఏపీ బీజేపీ చీఫ్ గా దగ్గుబాటి పురంధేశ్వరి ఉన్నారు. ఆమె టీడీపీకి బాగా సహకరించారు అని కూడా చెబుతారు. ఇటీవల జరిగిన ఎన్డీయే సమావేశంలో కూడా పురంధేశ్వరి బీజేపీ చీఫ్ గా ఉండబట్టే కూటమి అన్నీ అనుకున్న విధంగా అమలు చేసి నూరు శాతం లక్ష్యాలను సాధించి అని ప్రశంసించారు.

ఈ క్రమంలో పురంధేశ్వరి స్థానంలో కిరణ్ రాబోతున్నారు అని అంటున్నారు. కిరణ్ వస్తే కనుక అదే మాదిరిగా ఇచ్చి పుచ్చుకోవడాలు అదే రిలేషన్స్ కంటిన్యూ అవుతాయా అన్న చర్చ ఉంది. అయితే వాటిని పటాపంచలు చేసేలా బాబు ఇంటికే కిరణ్ వెళ్ళి భేటీ కావడంతో ఏపీలో కూటమి సుస్థిరంగా ఉంటుందని ఇదే రకామిన ఐక్యత ముందు ముందు సాగుతుందని అంతా భావిస్తున్నారు. మరి బాబు ఢిల్లీ వెళ్ళి వచ్చిన తరువాత ఏ రకమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాల్సి ఉంది.