ఈ 'కెప్టెన్' నెగ్గుకురాగలరా?
అలాంటివాటిలో ఒకటి.. రాజంపేట లోక్ సభా నియోజకవర్గం.
By: Tupaki Desk | 25 April 2024 3:30 PM GMTఆంధ్రప్రదేశ్ లో శాసనసభకు, పార్లమెంటుకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని నియోజకవర్గాలు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్నాయి. అలాంటివాటిలో ఒకటి.. రాజంపేట లోక్ సభా నియోజకవర్గం. ఇక్కడి నుంచి వైసీపీ తరఫున సిట్టింగ్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి పోటీ చేస్తుండగా బీజేపీ తరఫున మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలో ఉన్నారు. దీంతో ఈ నియోజకవర్గం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
రాజంపేట ఎంపీ స్థానంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించాక జరిగిన ఎన్నికల్లో రెండే రెండుసార్లు ఆ పార్టీ విజయం సాధించింది. 1984, 1999ల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. మిగతా 1989, 1991, 1996, 1998, 2004, 2009ల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన ఎ.సాయిప్రతాప్ గెలుపొందారు.
ఇక వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి ఆయనే వైసీపీ తరఫున రంగంలో ఉన్నారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి తరఫున మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగారు.
అయితే రాజంపేట నియోజకవర్గంలో బలిజలు (కాపులు), ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మినహా ఇప్పటివరకు గెలుపొందిన ఎంపీలంతా కాపు సామాజికవర్గానికి చెందినవారే కావడం గమనార్హం. అయితే ఈసారి ప్రధాన పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులిద్దరూ రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కావడం విశేషం.
అయితే రాజంపేట లోక్ సభా నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉండటం బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డికి కొంత ఇబ్బందికరంగా మారిందని అంటున్నారు. దీంతో కూటమి తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులు కిరణ్ తో కలిసి ప్రచారం చేయడానికి మొగ్గు చూపడం లేదని చెబుతున్నారు. బీజేపీపైన ఉన్న కోపంతో ముస్లింలు తమకు ఎక్కడ దెబ్బ కొడతారోనన్న భయం టీడీపీ, జనసేన అభ్యర్థులకుందని అంటున్నారు.
మరోవైపు సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డికి అన్నీ సానుకూలాంశాలే కనిపిస్తున్నాయని చెబుతున్నారు. మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వంలో నంబర్ టూ మంత్రిగా రాయలసీమ రాజకీయాలను శాసిస్తున్నారు. గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లె ఎమ్మెల్యేగా ఉన్నారు. రాయలసీమలో వైసీపీ తర ఫున బరిలో ఉన్న చాలామంది అభ్యర్థులు పెద్దిరెడ్డి దయతో టికెట్లు దక్కించుకున్నవాళ్లే. దీంతో మిథున్ రెడ్డి హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్నారని చెబుతున్నారు.
అయితే కిరణ్ కుమార్ రెడ్డిని కూడా తక్కువ అంచనా వేయకూడదని అంటున్నారు. వాయల్పాడు, పీలేరు నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ చీఫ్ విప్ గా, స్పీకర్ గా కేబినెట్ మంత్రి హోదాలో పనిచేశారు. అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చిట్టచివరి ముఖ్యమంత్రిగా దాదాపు మూడేళ్లు అధికారంలో ఉన్నారు. అందులోనూ కిరణ్ కూడా బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన రాయలసీమ నేత. కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిశోర్ కుమార్ రెడ్డి పీలేరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్నాథరెడ్డి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా పనిచేశారు. పెద్దిరెడ్డి కుటుంబంతో పోలిస్తే కిరణ్ కే రాజకీయ నేపథ్యం ఎక్కువ.
ఈ నేపథ్యంలో రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి నెగ్గుకురాగలరో లేదో వేచిచూడాల్సిందే. ఎన్నికల్లో ఓడిపోతే ఆయన రాజకీయ భవిష్యత్ ముగిసినట్టేనని అంటున్నారు. ఎందుకంటే 2014లో రాష్ట్రం విడిపోయాక ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. జై సమైక్యాంధ్ర పార్టీ పెట్టారు. ఆ పార్టీ తరఫున అభ్యర్థులను పోటీ చేయించారు. అయితే ఒక్క సీటు కూడా రాలేదు.
2019లో రాజకీయాలకు పూర్తి దూరంగా ఉన్నారు. 2014 నుంచి 2024 వరకు పదేళ్ల పాటు రాజకీయాలకు దూరమయ్యారు. ఇప్పుడు ఎంపీగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.