Begin typing your search above and press return to search.

పురందేశ్వరి చేయలేని పని కిరణ్‌ చేయగలరా?

ఈ నేపథ్యంలో వైసీపీ కంచుకోటల్లో ఒకటయిన రాజంపేట ఎంపీ స్థానం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

By:  Tupaki Desk   |   19 March 2024 2:24 PM GMT
పురందేశ్వరి చేయలేని పని కిరణ్‌ చేయగలరా?
X

ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. బీజేపీ 6 ఎంపీ సీట్లు, 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ కంచుకోటల్లో ఒకటయిన రాజంపేట ఎంపీ స్థానం సర్వత్రా ఆసక్తి రేపుతోంది.

వైసీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో 2014, 2019ల్లో రాజంపేట లోక్‌ సభా స్థానంలో వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ తరఫున పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి రెండు పర్యాయాలు ఘనవిజయం అందుకున్నారు. 2014లో రాజంపేట సీటును పొత్తులో భాగంగా టీడీపీ.. బీజేపీకి కేటాయించింది. దీంతో ప్రస్తుత బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి రాజంపేట నుంచి పోటీ చేశారు. ఈ క్రమంలో ఆమెపై వైసీపీ అభ్యర్థి మిథున్‌ రెడ్డి 1,74,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు.

ఇక 2019 ఎన్నికల్లోనూ వైసీపీ తరఫున పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డి మరోసారి బరిలోకి దిగారు. ఈసారి టీడీపీ తరఫున దివంగత ఎంపీ డీకే ఆదికేశవులనాయుడి సతీమణి డీఏ సత్యప్రభ పోటీ చేశారు. అయితే ఆమెపై మిథున్‌ రెడ్డి 2,68,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు.

ఈ నేపథ్యంలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డిని ఓడించాలని టీడీపీ కంకణం కట్టుకుంది. మిథున్‌ రెడ్డి వైసీపీ అధినేత జగన్‌ కు కుడి భుజంగా వ్యవహరిస్తున్నారు. కీలకమైన ఉభయ గోదావరి జిల్లాలకు వైసీపీ కోఆర్డినేటర్‌ గా మిథున్‌ రెడ్డే ఉన్నారు. అలాగే వైసీపీ లోక్‌ సభా పక్ష నేతగానూ మిథున్‌ చక్రం తిప్పుతున్నారు. మరోవైపు ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వంలో నంబర్‌ టూ మంత్రిగా హవా చలాయిస్తున్నారని అంటున్నారు. రాయలసీమ జిల్లాల్లో అభ్యర్థుల ఎంపికలో ఆయనే కీలక పాత్ర పోషిస్తున్నారు.

అందులోనూ టీడీపీ అధినేత చంద్రబాబుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజకీయంగా ఆగర్భ శత్రుత్వం ఉంది. ఇటీవల చంద్రబాబు.. పెద్దిరెడ్డి నియోజకవర్గం పుంగనూరులో పర్యటించినప్పుడు అంగళ్లులో చంద్రబాబుపై రాళ్ల దాడి జరిగింది. ఇందులో చంద్రబాబుపైనే పోలీసులు హత్యాయత్నం కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో ఈసారి తండ్రీకొడుకు ఇద్దరినీ ఓడించడానికి చంద్రబాబు గట్టిగా కంకణం కట్టుకున్నారని అంటున్నారు.

ఈ నేపథ్యంలో రాజంపేట ఎంపీ సీటును బీజేపీకి కేటాయించడంతో అక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి, చిత్తూరు జిల్లాకే చెందిన కీలక నేత నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని బరిలోకి దింపుతారని అంటున్నారు. ఆయన అయితే మిథున్‌ రెడ్డికి గట్టి పోటీ ఇవ్వగలరని చెబుతున్నారు. అందులోనూ కిరణ్‌ ది కూడా రాయలసీమే కావడం, చిత్తూరు జిల్లానే కావడం, ఆర్థిక, అంగ బలాల్లో పెద్దిరెడ్డికి ధీటుగా నిలబడగలిగే సామర్థ్యం ఉండటం, రెడ్డి సామాజికవర్గానికే చెందిన నేత కావడం వంటి కారణాలతో కిరణ్‌ కుమార్‌ రెడ్డిని బీజేపీ బరిలో దింపుతుందని తెలుస్తోంది.

2014లో కమ్మ సామాజికవర్గానికి చెందిన పురందేశ్వరిని, 2019లో కాపు సామాజికవర్గానికి చెందిన డీకే సత్యప్రభను బరిలోకి దించినా పెద్దిరెడ్డి మిథున్‌ రెడ్డిని బీజేపీ, టీడీపీ ఓడించలేకపోయాయి. ఈసారి రెడ్డి సామాజికవర్గానికే చెందిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డిని బరిలోకి దించి మిథున్‌ రెడ్డిని ఓడించాలని గట్టి పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో కిరణ్‌ విజయం సాధించగలరో లేదో వేచిచూడాల్సిందే.