మాట మీద నిలబడ్డ కిషన్‌రెడ్డి...రేవంత్ ఇప్పుడేం చేస్తాడో మరి
అలా చేరిన ఘట్టంలో కీలక ఛాలెంజ్‌ను అంగీకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ఘట్టానికి నేడు శ్రీకారం చుట్టారు.
By: Tupaki Desk | 16 Aug 2024 8:30 PM GMTతెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన అంశం మూసి మురికి! కలుషితమైన ఈ నదికి పునరుజ్జీవం కల్పించే ప్రయత్నం కాస్త రాజకీయ దుమారంగా మారింది. విమర్శలు, ప్రతి విమర్శల స్థాయికి చేరిపోవడమే కాకుండా ఏకంగా సవాళ్లు విసిరే వరకూ చేరింది. ఎమ్మెల్యేలు, మంత్రుల స్థాయిని దాటి ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల వరకూ చేరిపోయింది. అలా చేరిన ఘట్టంలో కీలక ఛాలెంజ్‌ను అంగీకరించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ఘట్టానికి నేడు శ్రీకారం చుట్టారు.
మూసి వల్ల నష్టపోతున్న ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా తాము శుద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే.... ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని మండిపడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... దమ్ముంటే విపక్ష నేతలు మూసి పరివాహక ప్రాంతంలో నిద్ర చేయాలని సవాల్ విసిరారు. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరును సైతం రేవంత్ ప్రస్తావించారు. దానిపై గతంలోనే కిషన్ రెడ్డి స్పందిస్తూ...మూసి శుద్దికి తాము వ్యతిరేకం కాదని అయితే, ఒక్కో పైసా కూడబెట్టి ప్రజలు ఇళ్లు కట్టుకున్నారని, సుందరీకరణ పేరుతో వాటిని కూలగొట్టి.. వారి ఉసురు పోసుకోవద్దని హితవు పలికారు. ‘మేము ఇక్కడ మురుగు వాసనతో ఉండలేకపోతున్నాం. ఇళ్లు కూల్చివేసి, పునరావాసం కల్పించండి’ అంటూ మూసీ బాధితులెవరైనా కాంగ్రెస్ పార్టీని, సీఎంను వేడుకున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
మూసి ప్రక్షాళన పేరుతో జరుగుతున్న చర్యల బాధితులకు న్యాయం జరిగేవరకు తమ పోరాటం కొనసాగుతుందని కిషన్ రెడ్డి పేర్కొనగా... అదే బాధితుల ఇండ్ల వద్ద నిద్ర చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. దీనికి తాజాగా కిషన్ రెడ్డి ఓకే చెప్పారు. బీజేపీ మూసి నిద్ర కార్యక్రమంలో భాగంగా ఈ రోజు సాయంత్రం 4గంటలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంబర్పేట్ నియోజకవర్గం, గోల్నాక డివిజన్, తులసి రామ్ నగర్ లో మూసి నిద్ర చేయనున్నారు. ముందుగా...తులసి రాం నగర్ బస్తీ లో పర్యటించి బస్తీ వాసులు, బాధితులతో మాట్లాడనున్నారు అనంతరం అక్కడే అదే బస్తిలో బస చేయనున్నారు.
గతంలో మూసి బాధితులతో కలిపి ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి నిరసన తెలిపారు. బస్తీల మీద పడి బుల్డోజర్లు, పొక్లయిన్లతో ఇళ్లు కూలగొడితే వాటికి అడ్డుపడుతామని కిషన్ రెడ్డి హెచ్చరించారు. అధికార కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలను బెదిరిస్తోందని, దీన్ని సహించే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. పేదల కోసం జైలుకైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. గండిపేట నుంచి చౌటుప్పల్ వరకు మూసీలో కలుస్తున్న మురుగును ముందుగా అడ్డుకోవాలన్నారు. మురుగును అడ్డుకోకుండా రూ.50 లక్షల కోట్లు ఖర్చు చేసినా శుద్ధి జరగదని చెప్పారు. సుందరీకరణకు అనేక మార్గాలున్నాయని, మురుగు కలవకుండా రెండువైపులా రిటైనింగ్ వాల్స్ నిర్మించాలన్నారు. నిజాం కాలంలో రిటైనింగ్ వాల్స్ కట్టిన విషయాన్ని కేంద్ర మంత్రి గుర్తుచేశారు.