Begin typing your search above and press return to search.

రేవంత్.. దమ్ముంటే వాటిని టచ్ చేయు.. కిషన్ రెడ్డి సవాల్

ఇప్పటికే మూసీ నిర్వాసితులు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేశారు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 9:28 AM GMT
రేవంత్.. దమ్ముంటే వాటిని టచ్ చేయు.. కిషన్ రెడ్డి సవాల్
X

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో మూసీపై‌ పాలిటిక్స్ కొనసాగుతున్నాయి. మూసీ సుందరీకరణ అని కాంగ్రెస్ ప్రభుత్వం ప్లాన్ చేసినప్పటి నుంచి ప్రతిపక్షాలు ఆ ప్రాజెక్టును విమర్శిస్తూనే ఉన్నాయి. అటు మూసీ ప్రజలు కూడా తమ ఇళ్లను ఖాళీ చేసేందుకు ఒప్పుకోలేదు. ఆ తరువాత కొంత మంది అంగీకరించి వెళ్లిపోయినా .. ఇంకా కొంత మంది మాత్రం దశాబ్దాలుగా ఉంటున్న ఇళ్లను ఖాళీ చేసేందుకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. దాంతో వారి పక్షాల ప్రతిపక్ష పార్టీలు పోరాడుతున్నాయి. ఇప్పటికే మూసీ నిర్వాసితులు సైతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేశారు. ఆందోళనలు చేపట్టారు.

కానీ.. ప్రభుత్వం మాత్రం మూసీ ప్రక్షాళన చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అందులోభాగంగా మూసీ వల్ల కలిగే దుష్ఫరిణామాలు ఇప్పటికే ప్రజలకు వివరించింది. మూసీ వల్ల నల్లగొండ ప్రజలు పడే బాధలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. మూసీ వల్ల భవిష్యత్ తరాలకు కలిగే నష్టాలను వివరించారు. మూసీ వల్ల వచ్చే కాలుష్యంతో పరివాహక ప్రజలు సైతం ఇబ్బందులు పడుతారని, అనారోగ్యాల బారిన పడతారని చెప్పుకొచ్చారు. అటు ప్రతిపక్షాలకు సైతం సవాల్ విసిరారు. దమ్ముంటే వారం రోజుల పాటు మూసీ ఏరియాలో ఉండాలని, గదుల అద్దె తాను చెల్లిస్తానని సవాల్ చేశారు. దీంతో అప్పటి నుంచి బీజేపీ, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా మూసీ రాజకీయాలు నడుస్తూనే ఉన్నాయి.

తాజాగా.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌కు మరో సవాల్ చేశారు. మూసీ పక్కన ఉన్న పదుల సంఖ్యలో దేవాలయాలు ఉన్నాయని.. వాటిని ముట్టుకునే దమ్ముందా..? అని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతం గురించి అసలు రేవంత్‌కు తెలుసా అని నిలదీశారు. అనేక మైసమ్మ దేవాలయాలు, పోచమ్మ దేవాలయాలు, ముత్యాలమ్మ ఆలయాలు ఉన్నాయని చెప్పారు. ముఖ్యమంత్రికి ఏది ముఖ్యమని నిలదీశారు. రేవంత్‌కు సుందరీకరణ ముఖ్యమా..? కాలనీల్లో రోడ్లు వేయడం ముఖ్యమా..? అంటూ ప్రశ్నించారు.

గ్రేటర్ మున్సిపాలిటీకి, వాటర్ బోర్డుకు వీధి లైట్ల కోసం డబ్బులు లేవు గానీ.. లక్షన్నర కోట్లతో మూసీ సుందరీకరణ అవసరమా అని కిషన్ రెడ్డి నిలదీశారు. మూసీ పక్కన ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, బస్టాండ్, మెట్రో స్టేషన్ల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పేదల మీద ఇంత ప్రతాపం ఎందుకని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లు కూలుస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పేదల కోసం జైళ్లకు వెళ్లేందుకైనా బీజేపీ నేతలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన చేపట్టాలని ప్రజలు ఎవరైనా ప్రభుత్వాన్ని అడిగారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నిర్ణయంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.