Begin typing your search above and press return to search.

కిషన్ రెడ్డి కేంద్ర మంత్రే.. బండికి నిరాశే..

ఎన్నికలకు ఆరేడు నెలల వ్యవధి కూడా లేని నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గాన్ని కదిలించే ఉద్దేశం ప్రధాని మోదీకి లేనట్లుంది

By:  Tupaki Desk   |   21 Sep 2023 8:50 AM GMT
కిషన్ రెడ్డి కేంద్ర మంత్రే.. బండికి నిరాశే..
X

కేంద్రంలో పరిస్థితులు చూస్తూ ఉంటే ఇక మంత్రివర్గ విస్తరణ కానీ.. చేర్పులు కానీ లేనట్లే కనిపిస్తున్నాయి. ఎన్నికలకు ఆరేడు నెలల వ్యవధి కూడా లేని నేపథ్యంలో ఇప్పుడు మంత్రివర్గాన్ని కదిలించే ఉద్దేశం ప్రధాని మోదీకి లేనట్లుంది. ప్రస్తుతం ఉన్న మంత్రివర్గాన్నే ఎన్నికల వరకు కొనసాగించి.. ప్రజల వద్దకు వెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. దీని ప్రభావం మిగతా రాష్ట్రాలపై ఏమో కానీ.. తెలంగాణపై పడనుండడమే ఇక్కడ చెప్పుకోదగ్గ అంశం.

ఏకైక తెలుగు కేంద్ర మంత్రి

దాదాపు పదికోట్ల మంది ఉన్న తెలుగువారికి ఏకైక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ స్థానం నుంచి ఎంపీగా ఎన్నికైన ఆయనకు మోదీ ప్రభుత్వంలో సముచిత స్థానమే దక్కింది. తొలుత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా కీలక బాధ్యతలు చూశారు. ఆ తర్వాత స్వతంత్ర హోదా ఉన్న పర్యటక శాఖను పర్యవేక్షిస్తున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా కింద సహాయ మంత్రిగా పనిచేయడం అంటే అది కిషన్ రెడ్డికి దక్కిన ప్రాధాన్యమే. పర్యటక శాఖ కూడా మంచి శాఖనే. కాగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచే బీజేపీకి లోక్ సభ సభ్యులున్నారు. ఏపీలో ఆ అవకాశం లేనందుకు మరెవరికీ కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కలేదు.

మార్పు లేనట్లే..

ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చేలా కేంద్ర మంత్రివర్గంలో మార్పులు ఉంటాయంటూ ఇటీవల పెద్దఎత్తున కథనాలు వచ్చాయి. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ ను తప్పించి, కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కిషన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. బీజేపీ వంటి పార్టీలో రెండు బాధ్యతలు ఒకే వ్యక్తికి ఇవ్వడం అరుదు. కానీ, కిషన్ రెడ్డికి మినహాయింపు అన్నట్లుగా ఆ పార్టీ అధిష్ఠాన్య వ్యవహరించింది. బండి సంజయ్ ను జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. పార్టీ పరంగా ఇది పెద్ద పదవే. కానీ, తెలంగాణ క్షేత్ర స్థాయిలో పని చేయాలంటే అధ్యక్షుడిగా ఉండడమే ముఖ్యం. అయితే, సంజయ్ కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం ఇస్తారని వార్తలు వచ్చినా.. మూడు నెలల నుంచి దానిపై ఎటువంటి కదలిక లేదు. పరిస్థితులు చూస్తుంటే కిషన్ రెడ్డిని రెండు బాధ్యతల్లోనూ కొనసాగించే అవకాశమే కనిపిస్తోంది.

సంజయ్ కు చాన్స్ లేనట్లే..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నట్లుండి తప్పించిన సంజయ్ కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశం లేనట్లు తెలుస్తోంది. ఎన్నికలకు ఆరేడు నెలలే ఉండడమే కాదు.. కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టే వీలుంది. వీటిలో ఒకటైన మహిళా రిజర్వేషన్ బిల్లును ఇప్పటికే పార్లమెంటు కొత్త భవనంలో ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టింది. ఇక అన్నిటికంటే ముఖ్యమైన పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)ను కలిపేసుకునే అంశం కూడా చర్చకు రావొచ్చనే ఊహాగానాలు వినిపించినా ఇంతవరకు ఏదీ నిర్ధారణ కాలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేయకపోవచ్చు. చేసినా పెద్దగా ఉపయోగం ఉండకపోవడంతో పాటు కూర్పు దెబ్బతినే ఆలోచన కూడా ఉండొచ్చనేది రాజకీయ విశ్లేషకుల మాట. దీంతోనే సంజయ్ కు నిరాశ తప్పదనే వాదన వస్తోంది.

తెలంగాణ ఎన్నికల తర్వాత..?

కిషన్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ఎన్నికల తర్వాత బీజేపీ పరిస్థితి ఏమిటనే ప్రశ్న వస్తోంది. ఎన్నికల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. బీజేపీ ఎంతమేరకు ప్రతిఘటిస్తుందో చూడాలి. అయితే, తెలంగాణలో అధికారంలోకి వచ్చేస్తుందనే ఆశల్లేవు. సీట్లు గతంలో కంటే కాస్త పెరగొచ్చు. అంటే.. ఓటమి కిందనే లెక్క. మరి అప్పటికీ కిషన్ రెడ్డినే కొనసాగిస్తూ, లోక్ సభ ఎన్నికలకు వెళ్తారని స్పష్టమవుతోంది