బీఆర్ ఎస్‌కు కిషన్ రెడ్డి సార్ సుద్దులు.. కేంద్రం ఉద్ధరించింది కూడా చెప్పేస్తే పోలా?!
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి... గంగాపురం కిషన్ రెడ్డి.. తాజాగా తెలంగాణ సర్కారుకు సుద్దు లు చెప్పారు
By: Tupaki Desk | 14 Sep 2023 5:30 PM GMTబీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి... గంగాపురం కిషన్ రెడ్డి.. తాజాగా తెలంగాణ సర్కారుకు సుద్దు లు చెప్పారు. అదేసమయంలో పలు విమర్శలు కూడా చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఏ ఒక్క వర్గానికీ నిరసన తెలియజేసే పరిస్థితి లేకుండా చేశారని నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాలరాస్తున్నారని, తన సొంత ఫామ్ హౌస్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు.
బహిరంగ వేదికలపై ఉద్యమాలు చేయవద్దు, అసెంబ్లీలో ఎవరూ నోరెత్తవద్దు అన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని కిషన్ రెడ్డి సారు తెగ మండి పడ్డారు. అంతేకాదు, శాంతియుతంగా నిరసన చేస్తుం టే బీజేపీ కార్యకర్తలపై విపరీతంగా దాడులు చేశారని.. ఈ దాడులలో అనేక మంది కార్యకర్తలకు గాయాల య్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, బీజేపీ పోరాటాలను అణిచి వేసేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
కట్ చేస్తే.. ఏ విషయాలను కిషన్ రెడ్డి ప్రస్తావించారో... అవే విషయాల్లో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభు త్వం ఎలా వ్యవహరిస్తోందనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి ఉంటే బాగుండేదనే చర్చ తెరమీదికి వచ్చింది. ఎందుకంటే.. అన్ని రాష్ట్రాలకు దేశానికి కూడా ఆదర్శంగా ఉండాల్సిన కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సైతం.. చేస్తోంది ఏంటి? అనే విషయాన్ని కిషన్ రెడ్డి సార్ చెప్పి ఉంటే బాగుండేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఎందుకంటే.. ఒక ఉద్యమం చేయాలన్నా.. ఒక నిరసన వ్యక్తం చేయాలన్నా.. మోడీ సర్కారు అవలంబిస్తు న్న తీరు అందరికీ తెలిసిందే. విపక్ష నాయకులపైనా.. ఉద్యమాలు చేస్తున్న నాయకులపైనా సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థలతో దాడులు చేయించి.. వారి నోళ్లు నొక్కడం లేదా? పార్లమెంటులో సైతం ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇస్తున్నారా? కనీసం పార్లెమెంటులో ఒక ప్రతిపక్షం అంటూ ఉందని గుర్తిస్తున్న దాఖలా ఉందా? అనే అంశాలు ఎప్పటికప్పుడు చర్చకు వస్తూనే ఉన్నాయి.
ప్రస్తుతం తెలంగాణ సర్కారుకు సుద్దులు చెబుతున్న కిషన్ రెడ్డి.. కేంద్ర మంత్రిగా ఇవే హక్కులు, స్వేచ్ఛ, ఉద్యమాలకు అనుకూల వాతావరణం వంటి విషయాల్లో కేంద్రానికి కూడా కొంత హితవు చెబితే బెటర్ అని తెలంగాణ సమాజం వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.