భాగ్యనగర్ గా హైదరాబాద్...బీజేపీ భారీ హామీ ఇదే !
తెలంగాణాలో బీజేపీకి అధికారం ఇస్తే హైదరాబాద్ ని భాగ్యనగర్ గా పేరు మారుస్తామని తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ జి కిషన్ రెడ్డి భారీ హామీ ఇచ్చారు
By: Tupaki Desk | 27 Nov 2023 5:44 PM GMTతెలంగాణాలో బీజేపీకి అధికారం ఇస్తే హైదరాబాద్ ని భాగ్యనగర్ గా పేరు మారుస్తామని తెలంగాణా బీజేపీ ప్రెసిడెంట్ జి కిషన్ రెడ్డి భారీ హామీ ఇచ్చారు. తమకు అధికారం ఇవ్వండి ఆ భాగ్యం అందుకోండి అని ఆయన అంటున్నారు.
దానికి ఆయన రీజన్స్ కూడా చెప్పుకొచ్చారు. అసలు ఎవరీ హైదర్ అని కూడా ప్రశ్నించారు. ఏమో హైదర్ ఎవరో హైదరాబాద్ పేరు ఎలాగో ఈ తరానికి తెలియదు అక్కరలేదు అనే అంటారు. మరి భాగ్యనగర్ పేరు ఎందుకు పెట్టాలి అన్న ప్రశ్నకు కిషన్ రెడ్డి ఇచ్చే సమాధానం పక్కా లోకల్ నేం అని.
దానికి ఆయన మరికొన్ని ఉదాహరణలు కూదా చెప్పారు. మద్రాస్ పేరుని అక్కడి ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి వచ్చి చెన్నైగా మార్చాయని గుర్తు చేశారు. అలాగే కలకత్తా పేరుని కోల్ కతాగా మార్చారని కూడా పేర్కొన్నరు. బొంబై పేరుని ముంబైగా మార్చిన ఘనత కూడా ప్రాంతీయ పార్టీలదే అయినపుడు జాతీయ భావాలు ఉన్న బీజేపీకి హైదరబాద్ ని మార్చే అధికారం హక్కూ ఎందుకు ఉండవని అంటున్నారు.
అయితే బీజేపీకి హక్కు ఉంది అధికారం మాత్రం ప్రజలు ఇవ్వాలని ఆయన అంటున్నారు. ఒక్క కిషన్ రెడ్డి మాత్రమే ఈ ప్రకటన చేయలేదు. యూపీ సీఎం ఆదిత్యనాధ్ యోగి కూడా హైదరాబాద్ పేరుని భాగ్యనగరంగా మారుస్తామని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన అంతటితో ఆగలేదు, మహబూబ్ నగర్ పేరుని కూడా పాలమూర్ గా మారుస్తామని మరో కొసరు హామీ ఇచ్చేశారు.
బీజేపీ పేర్లు మారుస్తామని అంటోంది. ఎన్నాళ్లీ బానిస మనస్తత్వం అని కూడా అంటోంది. బీజేపీ ఈ బానిస విధానాలు మారుస్తుంది అని అంటున్నారు. ఇలా కిషన్ రెడ్డి సంచలన ప్రకటనే చేశారు. మొత్తానికి చూస్తే తెలంగాణా ఎన్నికల ప్రచారంలో బీజేపీ ఎమోషనల్ ఇష్యూస్ నే జనం ముందు ఉంచుతోంది అని అంటున్నారు. ఆ పార్టీ జాతీయ నేత కేంద్ర హోం మంత్రి అయిన అమిత్ షా కూడా బీజేపీకి అధికారం ఇస్తే మైనారిటీలకు ఇచ్చే రిజర్వేషన్లు రద్దు చేస్తామని ప్రకటించారు.
మరి ఇవన్నీ జనంలోకి ఎంతవరకూ వెళ్తాయన్నదే చూడాల్సి ఉంది. నిజానికి భాగ్యనగర్ పేరు మార్చాల్సిందే. దాని కంటే ముందు అదే హైదరాబాద్ లో కోటి మంది జనాభా ఉన్నారు. మొత్తం తెలంగాణాలో మూడున్నర కోట్ల మంది ఉన్నారు. వారిని అందరినీ భాగ్యవంతులుగా చేస్తామని అసలైన హామీ ఇస్తే బాగుంటుంది కదా అన్న సూచనలు వస్తున్నాయి.
ఏది ఏమైనా బీజేపీ మాత్రం తనదైన ఆయుధాన్నే ప్రయోగిస్తోంది. దాని ఫలితాలు ఎలా ఉంటాయో చూడాల్సి ఉంది. అదే టైం లో జనాలకు కావాల్సింది ఇవేనా ఇంకా ఏమైనా ఉన్నాయా అన్నది కాషాయం వాదులు ఆలోచిస్తే బాగుంటుంది అన్న సూచనలు అందుతున్నాయి.