Begin typing your search above and press return to search.

కేంద్రమంత్రులే కానీ కిషన్ రెడ్డి.. బండిలో ఒక అంశం కామన్

అంచనాలకు తగ్గట్లే కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇద్దరికి చోటు దక్కింది.

By:  Tupaki Desk   |   10 Jun 2024 7:30 AM GMT
కేంద్రమంత్రులే కానీ కిషన్ రెడ్డి.. బండిలో ఒక అంశం కామన్
X

అంచనాలకు తగ్గట్లే కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఇద్దరికి చోటు దక్కింది. వారిలో ఒకరు.. గత ప్రభుత్వంలోనూ కేంద్ర మంత్రిగా వ్యవహరించిన కిషన్ రెడ్డి అయితే.. మరొకరు మాత్రం మొదటిసారి కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. నిజానికి ఈ ఇద్దరు నేతల తీరు.. మాటలు.. నడవడిక.. దేనికది చూసినా డిఫరెంట్ గా ఉంటుంది. బండి వ్యవహారం కెరటంలా ఉంటే.. కిషన్ రెడ్డి తీరు మలయమారుతంలా ఉంటుంది.

నమ్మిన వారి కోసం ఎంతకైనా అన్నట్లుగా బండి తీరు ఉంటే.. ఎదుటోడు ఎంత ముఖ్యుడైనా సరే ఆచితూచి అన్నట్లు కిషన్ రెడ్డి తీరుఉంటుంది. అటు మాటల్లో కానీ ఇటు చేతల్లో కానీ ఈ ఇద్దరు నేతల దారులు వేరు. కానీ.. వీరిద్దరిలోనూ కామన్ అంశం మాత్రం ఒకటి ఉంది. అదేమంటే.. బీజేపీలో వీరి ప్రయాణం అత్యంత చిన్న స్థాయి నుంచి మొదలు కావటం. ఇద్దరు పార్టీ సిద్ధాంతాన్ని తమ ఊపిరిగా.. అధినాయకత్వం ఆదేశాల్ని శిరోధార్యంగా పని చేస్తూ తమ సమర్థతను ప్రదర్శించిన వారే.

సికింద్రాబాద్ నుంచి రెండోసారి విజయం సాధించిన కిషన్ రెడ్డికి మోడీ కేబినెట్ లో మరోసారి చోటు దొరకగా.. కరీంనగర్ నుంచి రెండోసారి గెలుపొందిన బండి సంజయ్ కు తొలిసారి కేంద్ర మంత్రి హోదా దక్కింది. ఈ ఇద్దరూ పార్టీ కోసం మూడు దశాబ్దాలుగా పని చేస్తున్నారు. ఈ ఇద్దరి ఎంపికతో రాష్ట్రంలో ఓసీ.. బీసీలకు పదవుల్ని కట్టబెట్టి సమతుల్యతను సాధించినట్లుగా చెప్పాలి.

ఈ ఇద్దరు నేతలు తమ ప్రయాణాల్ని అత్యంత చిన్న స్థాయి నుంచి మొదలు పెట్టారు. బీజేపీ కార్యాలయంలో పని చేసిన కిషన్ రెడ్డి అంచలంచెలుగా ఎదుగుతూ ఈ రోజు ఈ స్థాయికి చేరితే.. బండి సంజయ్ విషయానికి వస్తే కరీంనగర్ బీజేపీలో అత్యంత చిన్న స్థాయి నుంచి తన రాజకీయ జీవితాన్ని షురూ చేశారు. తిరుగులేని నేతగా వెలిగిపోతున్న నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒక మాట అనేందుకు జంకే పరిస్థితుల్లో ముందు వెనుకా చూసుకోకుండా తన మాటలతో ఉతికి ఆరేసిన నేతగా బండి సంజయ్ ను చెప్పాలి.

కేసీఆర్ ను ఏమైనా అనొచ్చు. ఆయనపై విమర్శ చేయటానికి జంకాల్సిన అవసరం లేదన్న విషయాన్ని చాటి చెప్పిన బండి.. ఎంతోమందికి కొత్త దారిని చూపించారు. కేసీఆర్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసిన విషయంలో బండి ప్రధాన పాత్ర పోషించారని చెప్పాలి. ఒకప్పుడు తిరుగులేని నేత నుంచి ఇప్పుడు ఉనికి అన్నదే లేని పరిస్థితి వరకు చూస్తే.. ఇందులో బండి పాత్ర కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. మొత్తంగా కిషన్.. బండి ఇద్దరిని చూసినప్పుడు ఒక జాతీయ పార్టీలో సాదాసీదా స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకు ఎదిగే వీలుందని.. కష్టపడి పని చేయాలే కానీ పదవులు వాటంతట అవే వస్తాయన్న విషయాన్నివీరిద్దరూ నిరూపిచారని చెప్పాలి.