కిషన్ రెడ్డి బీజేపీ సీఎం అభ్యర్థి కాదా.. మరెవరు?
ఎందుకంటే, కిషన్ రెడ్డి దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి కాదు. విమర్శలు చేసినా అవి హుందాగా ఉంటాయి
By: Tupaki Desk | 23 Aug 2023 5:09 AM GMTతెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ను పదవి నుంచి తప్పించి పార్టీ పగ్గాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అధిష్టానం అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో అసెంబ్లీ ఎన్నికల తర్వాత కిషన్ రెడ్డే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి అవుతారని అంతా భావించారు. పార్టీ అధిష్టానం ఉద్దేశం కూడా ఇదేనని వార్తలు వచ్చాయి.
ఎందుకంటే, కిషన్ రెడ్డి దూకుడు స్వభావం ఉన్న వ్యక్తి కాదు. విమర్శలు చేసినా అవి హుందాగా ఉంటాయి. చిల్లర భాషను ఆయన మాట్లాడరు. దీంతో అన్ని వర్గాల ప్రజల్లో కిషన్ రెడ్డి అంటే ఒక గౌరవప్రదమైన అభిప్రాయం ఉందని అంటున్నారు. అలాగే రాజకీయంగా బేధాభిప్రాయాలు ఉన్నా ఇతర పార్టీల నేతలకు కిషన్ రెడ్డి అంటే గౌరవం ఉందని చెబుతున్నారు. రాజకీయంగా తటస్థంగా ఉన్నవారు సైతం కిషన్ రెడ్డిని ఇష్టపడతారనే అభిప్రాయాలు ఉన్నాయి.
అయితే.. కిషన్ రెడ్డిని బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడం అధిష్టానానికి ఇష్టం లేదని అంటున్నారు. బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరైనా బీసీ నేతే ఉంటారని పేర్కొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కిషన్ రెడ్డికి అసెంబ్లీ టికెట్ కూడా ఇవ్వకపోవచ్చని చెబుతున్నారు. గతంలో పలు పర్యాయాలు కిషన్ రెడ్డి అంబర్ పేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ఎన్నికల్లో అక్కడి నుంచే ఆయన ఓడిపోయారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రి కూడా అయిపోయారు.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లోనూ కిషన్ రెడ్డిని పార్లమెంటుకే పోటీ చేయిస్తారని టాక్ నడుస్తోంది. సికింద్రాబాద్ ఎంపీ సీటు ఇంకెవరికైనా ఇచ్చే పక్షంలో ఆయనను రాజ్యసభకు నామినేట్ చే స్తారని గాసిప్స్ వినిపిస్తున్నాయి. అంబర్ పేట్ లో కిషన్ రెడ్డి సతీమణి కావ్యారెడ్డిని బరిలోకి దింపొచ్చని చెబుతున్నారు.
అంబర్ పేట నుంచి కిషన్ రెడ్డి సతీమణిని పోటీ చేయిస్తే మహిళా ఓటర్లను ఆకర్షించొచ్చని బీజేపీ భావిస్తోంది. అలాగే హైదరాబాద్ నగర పరిధిలో ఒక మహిళకు సీటు ఇచ్చాం అనే క్రెడిట్ ను కొట్టేయొచ్చన్నదే బీజేపీ వ్యూహమని చెబుతున్నారు.
మరోవైపు ముషీరాబాద్ లేదా సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మిని పోటీకి దింపొచ్చని చెబుతున్నారు. ఇప్పటికే ఆమె 'అలాయ్ బలాయ్' పేరుతో అందరికీ దగ్గరయ్యారు. పార్టీ తరఫున కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నారు.
చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కావాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఢిల్లీకి వెళ్లి మరీ ఆందోళనలు నిర్వహించారు. అయితే తాజాగా కేసీఆర్ ప్రకటించిన బీఆర్‌ఎస్ అభ్యర్థుల్లో కేవలం ఏడుగురు మహిళలకు మాత్రమే సీట్లు లభించాయి. దీంతో కవితపై ప్రతిపక్షాలు, నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీలో ఉద్యమం చేయడం కాదని.. ముందు మీ తండ్రిని ఒప్పించి బీఆర్‌ఎస్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పై తాము పైచేయి సాధించాలంటే.. ఎక్కువ మంది మహిళలకు సీట్లు ఇవ్వాలని బీజేపీ అధిష్టానం భావిస్తోందని సమాచారం. తద్వారా భారీ ఎత్తున మహిళా ఓటర్లను ఆకర్షించవచ్చని చెబుతున్నారు. దీనివల్ల పార్టీకి భారీ మైలేజ్ కూడా వస్తుందని బీజేపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున డీకే అరుణ, విజయశాంతి, జయసుధ, బండ కార్తీక రెడ్డి, జూలూరు కీర్తిరెడ్డి, గీతా మూర్తి, రాణి రుద్రమ, ఆకుల విజయ, శ్రీ వాణి, డాక్టర్ వీరపనేని పద్మ వంటి పలువురు మహిళా నేతలకు ఖాయంగా టికెట్లు లభిస్తాయని చెబుతున్నారు.