రేవంత్, కిషన్ ముందు నుయ్యి - వెనుక గొయ్యి !
తాజాగా కేంద్రంలో మూడోసారి ఎన్డీఎ ప్రభుత్వం ఏర్పడింది
By: Tupaki Desk | 17 Jun 2024 7:11 AM GMTసింగరేణి. తెలంగాణకు దారి దీపం. గత పదేళ్లలో కేంద్రం వత్తిళ్లను ఎదుర్కొని కేసీఆర్ దానిని కాపాడుకుంటూ వస్తున్నారు. కేంద్రం సింగరేణి బొగ్గుతో పాటు ఆదాని బొగ్గు కొనాలని ఎంత వత్తిడి తెచ్చినా పట్టించుకోలేదు. తెలంగాణలోని 11 గనులను వేలం వేయాలని పలు మార్లు కేంద్రం నుండి ఆదేశాలు వచ్చినా ఒప్పుకోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. తాజాగా కేంద్రంలో మూడోసారి ఎన్డీఎ ప్రభుత్వం ఏర్పడింది. ఈ సారి కిషన్ రెడ్డికి గనుల మంత్రిత్వ శాఖ దక్కింది.
అయితే కిషన్ రెడ్డి అలా ప్రమాణ స్వీకారం చేశాడో లేదో తెలంగాణలో 11 ఖనిజ బ్లాక్ లను ఈ నెలాఖరులోగా వేలం వేయాలని కేంద్రం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో ఐదు సున్నపురాయి, ఐదు ఇనుప ఖనిజం, 1 మాంగనీస్ బ్లాక్ ఉంది. ఇందులో ఈ నెలాఖరుకు కనీసం ఆరు బ్లాకులను వేలం వేయాలని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులలో పేర్కొంది.
తెలంగాణలో మినరల్ బ్లాక్‌లను వేలం ద్వారా కేటాయించే ప్రక్రియ 2015లో ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి సరైన స్పందన లేకపోతే మినరల్ బ్లాక్‌లను కేంద్ర మే వేలం వేసేందుకు వీలు కల్పించేలా 2021లో మైనింగ్ రూల్స్‌కు సవరణ చేశారు. పరస్పర ఒప్పందం మేరకు సకాలంలో వేలం వేయాల్సి ఉంటుంది. లేకపోతే ఈ ప్రక్రియ కేంద్రం పరిధిలోకి వెళ్లుతుంది. విలువైన ఖనిజాల వేలం ప్రక్రియల సంబంధిత వ్యవస్థను దేశంలో ప్రవేశపెట్టిన తరువాత మొత్తం మీద 354 ప్రధాన మినరల్ బ్లాక్‌ల ఆక్షన్ జరిగింది. వీటిలో ఇప్పటివరకూ 48 బ్లాక్‌లలో తవ్వకాలు , ఉత్పత్తి ఆరంభమయ్యాయి.
రాష్ట్రాలలోని ఖనిజ నిల్వలను కేంద్రం ఇష్టారీతిన వేలం వేయడాన్ని కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకుంటూ వచ్చింది. సింగరేణిలో పలు బ్లాకులను ఆదానీకి కట్టబెట్టాలన్న కేంద్రం ప్రయత్నాలను అప్పట్లో నిర్దద్వంగా తోసిపుచ్చింది. ప్రస్తుతం కేంద్రంలో సంబంధిత మంత్రిగా కిషన్ రెడ్డి, రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇప్పుడు వేలం ప్రక్రియకు ఒప్పుకుంటే రేవంత్ రెడ్డి, ఒక వేళ రాష్ట్రంతో సంబంధం లేకుండా వేలం నిర్వహిస్తే కిషన్ రెడ్డి ఇద్దరూ తెలంగాణ సమాజం దృష్టిలో దోషులుగా నిలబడతారు. కేంద్రం పక్షం రోజుల సమయం మాత్రమే ఇవ్వడంతో ఈ వ్యవహారంలో ఎలా ముందుకు పోవాలా ? అన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం పడింది.