జనసేన కలయికపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు... అప్పటివరకూ ఆగాల్సిందే!
ఇదే క్రమంలో... జనసేన.. ఎన్డీఏ లో భాగస్వామ్య పార్టీ అని గుర్తు చేసిన కిషన్ రెడ్డి.. పవన్ కల్యాణ్ అనేక ఏళ్లుగా తమతోనే ఉన్నారని అన్నారు.
By: Tupaki Desk | 27 Oct 2023 5:44 AM GMTతెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుంటంతో భారతీయ జనతాపార్టీ స్పీడు పెంచింది. ఇప్పటికే 55 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. ఆ జాబితా విడుదల అనంతరం జరిగిన పరిణామాల సంగతి కాసేపు పక్కనపెడితే... ఈ గ్యాప్ లో జనసేనతో పొత్తు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. అయితే భారతీయ జనతా పార్టీ.. జనసేనతో పొత్తు పెట్టుకోవడాన్ని ప్రత్యర్థులు పెద్ద సీరియస్ గా తీసుకుంటున్నట్లు కనిపించనప్పటికీ... బీజేపీ పెద్దలు మాత్రం హ్యాపీగా ఉన్నారని అంటున్నారు!
తెలంగాణలో బీజేపీ - జనసేన కలిసే ఎన్నికలకు వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రత్యేక విమానంలో హస్తినకు వెళ్లిన పవన్, కిషన్ రెడ్డి... అమిత్ షా తో భేటీ అయ్యారు. దీంతో... పొత్తులపై క్లారిటీ వచ్చినట్లేననే కామెంట్లు వినిపించాయి. అయితే... అమిత్ షా తో భేటీ అనంతరం పవన్ మీడియాతో మాట్లాడలేదు. దీంతో కాస్త సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ సమయంలో కిషన్ రెడ్డి స్పందించారు.
అవును... జనసేనతో పొత్తు విషయంపై కేంద్రమంత్రి, టి.బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీతో కలిసి పోటీచేయాలనే ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. అనంతరం ఎవరు ఏయే స్థానాల్లో పోటీ చేయాలి అనే విషయాంపై కూడా స్పందించారు. ఇందులో భాగంగా... ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుందని అన్నారు.
ఇదే క్రమంలో... జనసేన.. ఎన్డీఏ లో భాగస్వామ్య పార్టీ అని గుర్తు చేసిన కిషన్ రెడ్డి.. పవన్ కల్యాణ్ అనేక ఏళ్లుగా తమతోనే ఉన్నారని అన్నారు. రెండో విడత జాబితా, జనసేనతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి కేటాయించనున్న సీట్లపై బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు భేటీ సందర్భంగా కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో రెండో విడత జాబితాపై వచ్చే నెల 1న ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ మీటింగ్ జరగనుందని తెలిపారు!
కాగా... పవన్ కల్యాణ్ ఇప్పటికే తెలంగాణలో జనసేన పోటీచేస్తుందని తెలిపారు. ఈ క్రమంలో 32 నియోజకవర్గాల పేర్లు ప్రకటించారు. అయితే... బీజేపీతో పొత్తు నేపథ్యంలో జనసేనకు 6 నుంచి 10 సీట్ల వరకు ఇచ్చే ఆలోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో... ఆ 6-10 సీట్లు కూడా ఎక్కడ ఇవ్వాలనే విషయంపై తాజాగా జరిగిన భేటీలో చర్చకొచ్చినట్లు సమాచారం.
ఇందులో భాగంగా.. ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో జనసేన అడుగుతున్న సీట్లపై చర్చ జరిగిందని తెలుస్తుంది. అయితే ఈ సీట్ల విషయంలో బీజేపీ నేతల నుంచి పెద్దగా అభ్యంతరాలు రాలేదని అంటున్నారు. కాకపోతే... జనసేన కాస్త గట్టిగా అడుగుతున్నట్లు చెబుతున్న శేరిలింగంపల్లి, కూకట్ పల్లి సీట్ల విషయంలోనే బీజేపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారని అంటున్నారు.
ఏది ఏమైనా... తెలంగాణలో పవన్ కు ఎన్ని సీట్లు ఇవ్వాలి, ఏయే సీట్లు ఇవ్వాలి అనేది వచ్చే నెల 1 న జరగనున్న బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో ఫైనల్ అవుతుందని అంటున్నారు.. అంటే... అప్పటివరకూ ఆగాల్సిందే!!