Begin typing your search above and press return to search.

ఆయన ఏడు సార్లు, ఈయన అయిదు సార్లు పోటీ.. కానీ ఈ సారి దూరం

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. విజయంపై కన్నేసిన పార్టీలన్నీ ప్రజా క్షేత్రంలో తేల్చుకునేందుకు సమరోత్సాహంతో సాగుతున్నాయి.

By:  Tupaki Desk   |   3 Nov 2023 5:30 PM GMT
ఆయన  ఏడు సార్లు, ఈయన అయిదు సార్లు పోటీ.. కానీ ఈ సారి దూరం
X

తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పరిణామాలు రసవత్తరంగా మారుతున్నాయి. విజయంపై కన్నేసిన పార్టీలన్నీ ప్రజా క్షేత్రంలో తేల్చుకునేందుకు సమరోత్సాహంతో సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణపై కన్నేసిన బీజేపీ కూడా ఎన్నికల సమరానికి సిద్ధమైంది. మూడు విడతలుగా 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ జాబితా చర్చనీయాంశంగా మారుతోంది. బీజేపీ తెలంగాణ కీలక నాయకులు ఇద్దరు ఈ సారి ఎన్నికల పోటీకి దూరంగా ఉండటం హాట్ టాపిక్ గా మారింది. ఆ ఇద్దరే.. కె. లక్ష్మణ్, కిషన్ రెడ్డి.

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. ఇక కె.లక్ష్మణ్ సీనియర్ నాయకుడు. తెలంగాణలో బీజేపీకి ఆయనో పెద్ద దిక్కు లాగా. కానీ ఈ సారి హైకమాండ్ నిర్ణయం మేరకు ఈ ఇద్దరు నాయకులు పోటీకి దూరంగా ఉంటున్నారు. గత 29 ఏళ్లలో ఏడు సార్లు పోటీ చేసిన కె.లక్ష్మణ్ రెండు సార్లు విజయం సాధించారు. 1994, 1999, 2004, 2009, 2014, 2018 ఎన్నికల్లో, 2008 ఉప ఎన్నికల్లో ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున కె.లక్ష్మణ్ పోటీ చేశారు. 1999, 2014లో విజయం సాధించారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.

మరోవైపు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి పోటీ చేయలేకపోతుండటం ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. 1999లో కార్వాన్ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. 2004లో హిమాయత్ నగర్ నుంచి గెలుపొందారు. 2009, 2014 ఎన్నికల్లో అంబర్ పేట్ నుంచి జయకేతనం ఎగురవేశారు. కానీ 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. ఈ సారి అంబర్ పేట్ నుంచి కిషన్ రెడ్డి పోటీ చేస్తారనే వ్యాఖ్యలు వినిపించాయి. కానీ అక్కడ బీజేపీ టికెట్ ను క్రిష్ణ యాదవ్ కు కేటాయించడంతో ఎంపీ కిషన్ రెడ్డి పోటీ చేయడం లేదని అర్థమైంది. ఈ ఇద్దరు సీనియర్ నాయకులు పోటీకి దూరంగా ఉండి, ఎన్నికల్లో తమ అభ్యర్థుల కోసం ప్రచారం చేయనున్నారు.