జంపింగుల ఊసెత్తని కిషన్‌రెడ్డి.. అది కూడా అధిష్టానమే చూస్తుందా?
దాదాపు గంట సేపు మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి జంపింగులపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం దాట వేశారు. జనసేనతో పొత్తు విషయాన్ని బీజేపీ అధిష్టానం చూస్తుందన్నారు.
By: Tupaki Desk | 2 Nov 2023 2:30 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కీలక సమయంలో దాదాపు అన్ని పార్టీల నుంచి నాయకులు జంప్ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్, బీఆర్ ఎస్ నేతలు గోడలు దూకితో ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. ఈ పార్టీకి చెందిన కీలక నాయకులు కమల గూటి నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి పెద్దపల్లి వివేక్ రాజీనామా చేశారు. ఇక, తాజాగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి కూడా రాజీనామా చేశారు. ఈ అనూహ్య పరిణామాలతో బీజేపీ క్యాడర్ అయోమయంలో పడింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ టికెట్ వస్తుందని రాకష్‌రెడ్డి అనుకున్నారు. అంతేకాదు.. తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డికి పలుమార్లు విన్నవించారు కూడా. అయితే, తాజాగా వెల్లడించిన మూడో జాబితాలోనూ తన పేరు కనిపించలేదు. దీంతో ఆయన పార్టీ మారేందుకు రెడీ అయి.. బీజేపీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. అయితే.. తాజాగా మీడియాతో మాట్లాడిన కిషన్‌రెడ్డి ఈ విషయాలను అసలు ప్రస్తావించకపోవడం గమనార్హం.
దాదాపు గంట సేపు మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి జంపింగులపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు సమాధానం దాట వేశారు. జనసేనతో పొత్తు విషయాన్ని బీజేపీ అధిష్టానం చూస్తుందన్నారు. అదేవిధంగా మేనిఫెస్టోలో ఏయే విషయాలు ఉండాలో కూడా అధిష్టానమే చూస్తుందని సెలవిచ్చారు. ఇక, జంపింగులపై తాను ఏమీ మాట్లాడబోనని, ఎవరి ఇష్టం వారిదని మాత్రమే చెప్పారు. రాష్ట్రంలో అరాచక పాలన రాజ్యమేలుతోందని.. అవినీతి కుప్పలుగా కనిపిస్తోందని విమర్శలు గుప్పించారు. అలివి కాని హామీలతో కాంగ్రెస్‌వస్తోందని.. దీనివల్ల ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. కానీ, ఎక్కడా కూడా జంపింగుల విషయాన్ని ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం.