"హనుమాన్" హీరోను సత్కరించిన కేంద్రమంత్రి!
తేజా సజ్జ హీరోగా వచ్చిన "హనుమాన్" సినిమా సంక్రాతికి విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే
By: Tupaki Desk | 18 Jan 2024 6:38 AM GMTతేజా సజ్జ హీరోగా వచ్చిన "హనుమాన్" సినిమా సంక్రాతికి విడుదలై సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రశాంత వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా... బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది! ఇందులో భాగంగా ఇప్పటికే 100 కోట్ల మైలురాయిని దాటిందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ సినిమాని చూసిన వాళ్ళందరూ కూడా చిత్ర యూనిట్ ని, హీరోని అభినందిస్తున్నారు.
అవును... సంక్రాంతి పండుగ కానుకగా వచ్చిన "హనుమాన్" చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రవాహన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వరల్డ్ బాక్సాఫీస్ వద్ద అత్యధికంగా టికెట్ల అమ్మకాలు జరిపిన చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఈ సినిమా... విడుదలైన రోజు నుంచి నిలకడగా వసూళ్లను సాధిస్తుంది. ఇందులో భాగంగానే 100 కోట్ల మార్కును దాటి 150 కోట్లకు చేరువగా ప్రయాణిస్తుందని అంటున్నారు.
ఈ సమయంలో తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. "హనుమాన్" సీనిమా హీరో తేజా సజ్జాని అభినందించారు. న్యూఢిల్లీ లోని ఆయన నివాసంలో తేజని కిషన్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా... సినిమా సూపర్ హిట్ అవడం సంతోషంగా ఉందని చెప్పిన కిషన్ రెడ్డి... శ్రీ రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమ సందర్భంగా భవ్య రామ మందిరానికి ప్రతి టికెట్టు నుండి రూ. 5 విరాళంగా ఇవ్వడం అభినందించిదగ్గ అంశమని అన్నారు.
మరోపక్క.. సంక్రాంతికి విడుదలైన ఈ హనుమాన్ చిత్రం తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా భారీ వసూళ్లను రాబడుతుంది. ఈ సినిమా మూడు భాషల్లో కలిపి సుమారుగా 10 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టిందని అంటున్నారు. దీంతో... ఇండియా వైడ్ గా 97 కోట్ల రూపాయల నికర వసూళ్లను నమోదు చేసిందని చెబుతున్నారు.
కాగా... "హనుమాన్" ప్రీ రిలీజ్ వేడుకకు చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో... ఈ మూవీ టీం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఈ సినిమా కోసం తెగే ప్రతీ టికెట్ నుంచి వచ్చే ఆదాయంలో రూ.5 అయోధ్య రామమందిరం కోసం విరాళంగా ప్రకటించింది.